కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో చెరుకు సుధాకర్ ఇవాళ భేటీ అయ్యారు. గత వారంలోనే చెరుకు సుధార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో చెరుకు సుధాకర్ గురువారం నాడు గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకొంది. గత వారంలోనే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
మాణికం ఠాగూర్ తో భేటీ ముగిసిన తర్వాత చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమని కోరితే తాను మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెరుకు సుధాకర్ తెలిపారు. మాణికం ఠాగూర్ ను తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా చెరుకు సుధాకర్ తెలిపారు. ఠాగూర్ తో భేటీలో మునుగోడు అసెంబ్లీ స్థానంలో పోటీ విషయమై చర్చ జరగలేదని ఆయన చెప్పారు. పార్టీ వ్యవహరాలపైనే చర్చ వచ్చిందని చెరుకు సుధాకర్ మీడియాకు వివరించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తాను ఏనాడూ కూడా వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి మిత్రుడినేనని చెప్పారు. కాంగ్రెస్ కోసం ఏం చేయమన్నా అది చేస్తానని చెరుకు సుధాకర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా తాను పోటీ చేస్తానని చెప్పారు. 1991లోనే తాను ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలోనే కోమటిరెడ్ది వెంకట్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. 2018 ఎన్నికల్లో నకిరేకల్ తనకు టికెట్ రాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగారన్నారు. ఒకవేళ తాను వెంకట్ రెడ్డి ని ఓడించాలనుకుంటే తనకు నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో 15 వేల ఓట్లు కూడా రావా అని ఆయ న ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ అభ్యర్ధుల విజయం కోసం పనిచేసినట్టుగా చెరుకు సుధాకర్ గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బద్ద శత్రువులు కావాలన్నారు. తాను ఎలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి శతృవుని అవుతానో అర్ధం కావడం లేదని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.
undefined
also read:కోమటిరెడ్డి బ్రదర్స్ ఎఫెక్ట్: కాంగ్రెస్ లోకి తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్
మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక కోణం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టమైన కోణం తీసుకు వచ్చే అవకాశం ఉందన్నారు. మునుగోడు టికెట్ ను ఉద్యమ కారులకు సామజికకోణంలో అట్టడుగు నుండి వచ్చిన వారికి టికెట్ ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టుగా చెరుకు సుధాకర్ చెప్పారు.
ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.