మునుగోడు ఉప ఎన్నికల్లోటీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు. అక్రమ మార్గాల ద్వారా ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం నాడు ఫిర్యాదు చేసింది. గురువారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ నేతృత్వంలోని బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ బృందంలో కేంద్ర మంత్రి మురళీధర్ , ఎంపీ సీఎం రమేష్ తదితరులున్నారు.
ఈసీ అధికారులతో భేటీ ముగిసిన తర్వాత తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలతో గెలవాలని చూస్తుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అతి తక్కువ కాలంలోనే 25వేల మంది ఎలా ధరఖాస్తులు చేస్తారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కొత్తగా నమోదైన ఓటర్ల పేర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టుగా తురుణ్ చుగ్ కోరారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తరుణ్ చుగ్ ఈసీని డిమాండ్ చేశారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈఏడాది ఆగస్టు 8వ తేదీన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
also read:మునుగోడు బైపోల్ 2022: పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
మునుగోడులో విజయం సాధించడం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని కొత్తగా 25 వేల మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారిలో నకిలీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఈ విషయమై ఈసీకి ఫిర్యాదులు చేశాయి ఈరెండు పార్టీలు. గత వారంలోనే ఈ విషయమై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ ఈసీకి లేఖ రాశాడు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లను పరిశీలించాలని కోరారు. ఇదే విషయమై హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రేపు ఉదయం వరకు ఓటర్ల నమోదుపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది.