మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.
మునుగోడు:మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కోమటిరెడ్డి సమర్పించారు.
వచ్చే నెల 3వ తేదీన మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. బీజేపీ అగ్రనేతలు వెంట రాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు మునుగోడునుండి చండూరు వరకు బీజేపీ నేతలు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం చండూరులో రిటర్నింగ్ కార్యాలయానికి అగ్రనేతలతో కలిసి వెళ్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్,సంజయ్ బన్సాల్, మాజీమంత్రి ఈటల రాజేందర్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఇంచార్జీ వివేక్ వెంకటస్వామి తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.
also read:తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే పోరు: మునుగోడు బైపోల్ పై కిషన్ రెడ్డి
2018లో ఇదే స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. తమకు మంచి పట్టున్న ఈ స్థానంలో ప్రత్యర్ధులకు అవకాశం దక్కకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్నటి నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు.