
హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయం ఓ వ్యక్తిని నిలువునా ముంచింది. ముక్కూ మొఖం తెలియని వ్యక్తితో ఫేస్ బుక్ ద్వారా స్నేహం పెరిగి ఇంట్లో ఆతిధ్యం ఇచ్చే స్థాయికి చేరింది. అయితే స్నేహితుడి ముసుగులో వచ్చిన వ్యక్తి ఆతిధ్యమిచ్చిన మిత్రుడి ఇంట్లోని దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా మేడిపల్లి విహారికా కాలనీకి చెందిన బాలకృష్ణ, ముంబయికి చెందిన రాజ్ కుమార్ రావత్(27) సోషల్ మీడియా స్నేహితులు. ఇద్దరికీ ఏమాత్రం పరిచయం లేకున్నా ఇటీవలే ఫేస్ బుక్ ద్వారా స్నేహితులయ్యారు. అయితే ముంబైలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ పనిపై హైదరాబాద్ వచ్చాడు. దీంతో బాలకృష్ణ అతడిని తన ఇంట్లోనే వుంచుకుని ఆతిథ్యం ఇచ్చాడు.
read more హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్‌పై కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం
ఇలా ఎంతో నమ్మకంతో కొద్దిరోజుల పాటు ఇంట్లో వుంచుకుని ఆతిథ్యమిచ్చిన బాలకృష్ణకే రావత్ టోకరా వేశాడు. ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటాయో గమనించిన రావత్ ఏడు తులాల బంగారాన్ని దొంగిలించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని ముగిసినట్లు చెప్పి ముంబైకి వెళ్లిపోయాడు.
అయితే రావత్ వెళ్లిపోయిన తర్వాత బంగారం చోరీకి గురయినట్లు గుర్తించిన బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ముంబైకి ప్రత్యేక బృందాన్ని పంపించి రావత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నగలు స్వాధీనం చేసుకొన్నారు.