ములుగు వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న పర్యాటకులు సేఫ్.. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్...

By SumaBala BukkaFirst Published Jul 27, 2023, 8:31 AM IST
Highlights

వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం బయటికి తీసుకువచ్చింది. 

ములుగు : ములుగు జిల్లాలోని వీరభద్రం అడవిలో పర్యాటకులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీరందరినీ ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ ఎన్డీఆర్ఎఫ్ పర్యాటకులు అందరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు అడవుల్లో చేపట్టిన రైస్కూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లుగా ప్రకటించారు. 

వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార వాటర్ ఫాల్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ జలపాతాన్ని చూడడానికి అనేకమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇదే క్రమంలో వర్షాకాలం సీజన్ కావడంతో కొంతమంది పర్యాటకులు జలపాతం చూడడానికి ముత్యంధారా జలపాతం దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో నీటి ప్రవాహం పెరిగింది.

జలపాతాన్ని చూసేందుకు వెళ్లి.. అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు..

దీంతో కొంతమంది పర్యాటకులు బయటికి రాలేక అడవుల్లో చిక్కుకుపోయారు. వెంటనే వారు  సమాచారాన్ని తమ బంధువులకు చేరవేయడంతో ఈ విషయం తెలిసిన మంత్రి సత్యవతి రాథోడ్ వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులతో పాటు రెస్క్యూటీమ్ ఆ పర్యాటకులను రక్షించడానికి రంగంలోకి దిగారు. కానీ వారిని రక్షించలేకపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది.

దాదాపు 8 గంటపాటు  శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళను రక్షించారు. బాధితులను అంకన్న గూడెంకు చేర్చారు.  అక్కడ  జిల్లా ఎస్పీ, కలెక్టర్ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ముత్యంధారా జలపాతం ఒకటిగా పేరుంది. వర్షాకాలంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ జలపాతం అద్భుతంగా ఉంటుంది. దీంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా జలపాతానికి పర్యాటకులు చేరుకుంటుంటారు.  

click me!