
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమౌతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరింత అవకాశాలు కురిసే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని పేర్కొంది. వర్షాల సమయంలో బయటకు రాకూడదని హెచ్చరించింది. ముంపు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. వర్షాలు, వరదల నుంచి సహాయం కోసం 18004251980 నెంబర్ ను పేర్కొంది.
ఇదిలా ఉండగా.. తూర్పు, ఉత్తర తెలంగాణ అంతటా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గోదావరి ఇప్పుడు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రిలో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.