ములుగు జిల్లాలో బాలుడు ప్రాణం మీదకు తెచ్చిన గాలిపటం.. కరెంట్ తీగల మధ్య చిక్కుకోవడంతో..

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 4:11 PM IST
Highlights

సంక్రాంతి పండగ మూడు రోజులు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే ములుగు జిల్లాల్లో గాలిపటం ఎగరవేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ పిల్లాడు గాలి పటం ఎగరవేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.


తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో ఆ జోష్ ఎక్కువగా కనిపిస్తుంది. సంక్రాంతికి కొద్ది రోజుల ముందు నుంచే పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ కనిపిస్తుంటారు. ఈ సంక్రాంతి పండగ మూడు రోజులు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే ములుగు జిల్లాల్లో గాలిపటం ఎగరవేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ పిల్లాడు గాలి పటం ఎగరవేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాలు.. ములుగు జిల్లా కేంద్రంలో ఓ 12 ఏళ్ల కుర్రాడు.. గాలిపటం ఎగరవేస్తుండగా.. కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. 

దీంతో ఆ పిల్లాడు గాలిపటాన్ని తీసేందుకు కరెంట్ పోల్ ఎక్కాడు. అయితే కరెంట్ తీగల నుంచి గాలిపటం తీసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అయితే లైన్‌మెన్ వెంటనే అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. వెంటనే కరెంట్ పోల్ ఎక్కిన లైన్‌మెన్.. తాడు సాయంతో బాలుడిని కింది దించాడు. అయితే కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలైన బాలుడు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

అనంతరం బాలుడిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, సంగారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో గాలిపటాలను ఎగిరవేస్తున్న ముగ్గురు పిల్లలకు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కప్పరి లోకేష్‌(11), సాయిరామ్, సుదర్శన్‌లు ఓ భవనం పైకెక్కి గాలిపటాలు ఎగరవేస్తుండగా.. అది విద్యుత్ తీగలపై ఇరుక్కుపోయింది. దీంతో వారు దానిని తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే విద్యుత్ షాక్‌కు గురయ్యారు. లోకే‌ష్‌కు 90 శాతం కాలిన గాయాలు కాగా, మిగిలిన ఇద్దరికి 30 శాతం మేర కాలిన గాయాలయ్యాయి. అయితే లోకేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 
 

click me!