ముక్కోటి ఏకాదశి : ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు..

By SumaBala Bukka  |  First Published Dec 23, 2023, 8:39 AM IST

వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునే భారీగా తరలివచ్చారు.  హైదరాబాదులోని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. 


శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణ కథనం. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్టే అని నమ్మకం.  

అందుకే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు బారులు తీరుతున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాద్రి రామాలయాలు  భక్తులతో నిండిపోయాయి. ఈ దేవాలయాల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారాలు తెచ్చుకున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటున్నారు. భద్రాద్రిలో భక్తులకు గరుడ వాహనంపై రాముడు, గజ వాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణుడు దర్శనమిచ్చారు. 

Latest Videos

తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికంటే ముందే తెల్లవారుజామున రెండున్నర గంటలకు మూలవిరాట్టుకు మహాక్షిరాభిషేకం చేశారు. ఆ తర్వాత ఉదయం 5 గంటల నుంచి భక్తులను అనుమతించారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునే భారీగా తరలివచ్చారు.  హైదరాబాదులోని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగా రద్దీ పెరిగింది. తిరుమలలో తెల్లవారుజామున 1.45 నిమిషాల నుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు.  వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. ఏలూరులోని ద్వారకా తిరుమలలో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర భక్తులు భారీగా చేరుకున్నారు. 

మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. గరుడ వాహనంపై అమ్మవార్లతో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు. భక్తులకు బంగారు శంకుతో పూజారులు తీర్థం ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు శంకు తీర్థం ఇచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

click me!