కత్తి మహేష్ కేనా, పరిపూర్ణానందకు వర్తించవా: మందకృష్ణ మాదిగ

First Published Jul 10, 2018, 4:42 PM IST
Highlights

దళితుడైనందునే  కత్తి మహేష్ పై నగర బహిష్కరణ శిక్ష విధించారని ఎస్పీ, ఎస్టీ పరిరక్షణ వేదిక నేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన  ఇతరులను నగర బహిష్కరణ శిక్ష ఎందుకు  విధించలేదని ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ నేత , ఎమ్మార్పీఎస్  నేత మందకృష్ణ మాదిగ  ప్రశ్నించారు

మంగళవారం నాడు  హైద్రాబాద్‌లో  ఆయన మీడియాతో మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో  సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను నగరం నుండి బహిష్కరించడాన్ని ఆయన తప్పుబట్టారు. దళితుడైనందునే  కత్తి మహేష్‌ను నగరం నుండి బహిష్కరించారని ఆయన ఆరోపించారు.  భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇతరులు కూడ  చేసిన విమర్శలు, ప్రకటనలపై వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని  మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో  ఇతరులను కించపర్చే విధంగా మాట్లాడడం సరైందికాదని  డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

షీర్డీ సాయిబాబా భక్తులను కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద మాట్లాడిన విషయాలను ఆయన ప్రస్తావించారు.  ఈ వ్యాఖ్యలు భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను కించపర్చలేదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు  మథర్ థెరిస్సాను కూడ కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద  ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రామాయణ విషవృక్షం పేరుతో ఓ పుస్తకం రాసిన రంగనాయకమ్మను ఎందుకు నగర బహిష్కరణ చేయలేదని ఆయన ప్రశ్నించారు.  రంగనాయకమ్మ దళితురాలు కానందునే ఆమెపై చర్యలు తీసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆమె రాసిన పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదో చెప్పాలని ఆయన కోరారు. 

దళితులను, పేదలను కించపర్చేలా మాట్లాడే ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ చట్టాలు వర్తించవా అని మందకృష్ణ ప్రశ్నించారు.  దళితుడైనందునే  కత్తిమహేష్‌కు ఇవన్నీ వర్తించాయని మందకృష్ణ అభిప్రాయపడ్డారు.  ఇతరులకో న్యాయం, దళితులకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.

దళితులు  ప్రజాస్వామ్య పద్దతిలో  నిరసన తెలిపినా నేరమే అవుతోందన్నారు.  కనీసం మాట్లాడినా కూడ  నేరంగా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కత్తి మహేష్‌పై  విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.. తాను లేవనెత్తిన అంశాలకు డీజీపీ బహిరంగంగా సమాధానం చెప్పాలని ఆయన కోరారు. 


 

click me!