స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధికే టిక్కెట్టు కేటాయించాలని మందకృష్ణ మాదిగ బీఆర్ఎస్ ను కోరారు.
వరంగల్: కడియం శ్రీహరికి బీఆర్ఎస్ బీ ఫాం ఎలా వస్తుందో చూస్తానని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా చెప్పారు.సోమవారం నాడు స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన ఎంఆర్‌పీఎస్ సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కూడ కడియం శ్రీహరి కారణమని ఆయన ఆరోపించారు. కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్ పూర్ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వొద్దని ఆయన కోరారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీటును మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలన్నారు. రాజయ్యకు టిక్కెట్టు ఇవ్వకపోతే మరో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.
ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రాజయ్యకు చోటు దక్కలేదు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో రాజయ్య తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు టిక్కెట్టు దక్కకపోవడంతో అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రాజయ్యను ఆయన అనుచరులు కోరారు. అయితే రాజయ్య మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ప్రజా క్షేత్రంలో ఉంటానని కూడ ఆయన ప్రకటించారు. పంట చేతికొచ్చే సమయంలో కుప్ప మీద మరో వ్యక్తి కూర్చునేందుకు వస్తే ఊరుకుంటానా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల తర్వాత రాజయ్యతో చర్చించేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డి వచ్చారు. అయితే రాజయ్య అందుబాటులో లేరు. దీంతో రాజయ్య వర్గీయులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల తర్వాత రాజయ్యకు పార్టీ నాయకత్వం మంచి పదవిని ఇవ్వనుందని కేసీఆర్ హామీ ఇచ్చారని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.
also read:ఆరునూరైనా ప్రజా జీవితంలోనే ఉంటా: తేల్చేసిన తాటికొండ
2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య విజయం సాధించారు. 2014 లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అయితే కొంత కాలానికే రాజయ్యను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీకి కడియం శ్రీహరి ఆసక్తిని చూపారు. అయితే రాజయ్యకే కేసీఆర్ అవకాశం కల్పించారు. రాజయ్య విజయం కోసం కడియం శ్రీహరి ఆనాడు కృషి చేశారు. అయితే ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలతో రాజయ్యను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. ఈ తరుణంలో స్టేషన్‌ఘన్ పూర్ లో మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.