ఉప్పల్ బీఆర్ఎస్‌లో వేడెక్కిన రాజకీయం.. బలి చేశారని భేతి ఆవేదన.. పార్టీ మారే ఆలోచన!

Published : Aug 29, 2023, 02:10 PM IST
ఉప్పల్ బీఆర్ఎస్‌లో వేడెక్కిన రాజకీయం.. బలి చేశారని భేతి ఆవేదన.. పార్టీ మారే ఆలోచన!

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది బీఆర్ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్నిచోట్ల సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించడంతో వారు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది బీఆర్ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్నిచోట్ల సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించడంతో వారు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఉప్పల్ నియోజకర్గం ఎమ్మెల్యేగా భేతి సుభాష్ రెడ్డిని కాదని బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం టికెటిచ్చింది. దీంతో ఉప్పల్ బీఆర్ఎస్‌లో అసమ్మతి రాజుకుంది. వాస్తవానికి రానున్న ఎన్నికలకు సంబంధించి ఉప్పల్ బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భేతి సుభాష్ రెడ్డితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మారెడ్డిలు కూడా ఆశించారు. 

అయితే భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్‌లలో ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని చాలా మంది ఆశించారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం బండారి లక్ష్మారెడ్డికు టికెట్ కేటాయించింది. దీనిపై ఇరు వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నివాసానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇన్నాళ్లూ వ్యతిరేక వర్గాలుగా ఉన్న భేతా సుభాష్ రెడ్డి, బొంతు శ్రీదేవిలు సమావేశం కావడంతో.. ఉప్పల్ బీఆర్ఎస్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. 

ఇక, భేతి సుభాష్ రెడ్డి మంగళవారం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. రాజకీయ భవితవ్యంపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. అనంతరం భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2001 నుంచి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు.  పార్టీ ఏ బాధ్యత అప్పగించిన నేను నిర్వహించానని అన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడనని అన్నారు. బండారి లక్ష్మారెడ్డి పార్టీ జెండా మోశారా? అని ప్రశ్నించారు. బండారి లక్ష్మారెడ్డికు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

లక్ష్మారెడ్డి ట్రస్ట్ పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారని.. ఆయన ఫ్లెక్సీలలో కాంగ్రెస్ నేతల ఫోటోలే ఉంటాయని సుభాష్ రెడ్డి విమర్శించారు. తాను, బొంతు రామ్మోహన్‌ ఉద్యమకారులం అని చెప్పారు. టికెట్ ఖరారు చేసే ముందు కనీసం తనతో చర్చించలేదని అన్నారు. తాను ఏం తప్పు చేశాను? తననెందుకు బలి చేశారు? అని ప్రశ్నించారు. మేకను బలిచ్చే ముందు కూడా దానికి నీళ్లు తాగిస్తారని.. ఎవరికైనా ఉరి వేసే ముందు కూడా చివరి కోరిను ఓసారి అడుగుతారని అన్నారు. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. 

తన క్యాడర్ ఆందోళన చేస్తానంటే వద్దని చెప్పానని తెలిపారు. 10 రోజుల్లో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ మార్పుపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీ లైన్‌లో పనిచేయాలని బీఆర్ఎస్ తనకు చెప్పలేదని తెలిపారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్ రాలేదని చెప్పారు. అయితే భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరుగుతుంది. భేతి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నుంచి ఆఫర్లు ఉన్నాయని ఆయన వర్గం చెబుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్