సీఎం అపాయింట్ మెంట్ ఇప్పిస్తే కోటి రూపాయలు ఇస్తా : మంద కృష్ణ మాదిగ

First Published Jun 15, 2018, 1:24 PM IST
Highlights

48 గంటల్లో  ఇప్పిస్తే...

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని ఎమ్మార్పిఎఫ్ వ్యవస్థాపక అద్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. తానేమీ వ్యక్తిగత పనుల కోసం కలవానుకోవడం లేదని,  దళితుల సమస్యల గురించి మాట్లాడాలని అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు 48 గంటల్లో సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పించిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అయితే ఇంత డబ్బులు తన వద్ద లేకున్నా బిచ్చమెత్తుకుని అయినా ఇస్తానని మంద కృష్ణ మాదిగ అన్నారు.

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లిలో హత్యకు గురైన తండ్రి, కొడుకులు సావనపెల్లి ఎల్లయ్య, శేఖర్‌ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. వీరి కుటుంబానికి ఎమ్మార్ఫిఎఫ్ తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన నడుస్తోందని అన్నారు. దళితుల సమస్యలపై కేసీఆర్ ను కలిసేందుకు పదిసార్లు లేఖలు రాసినా, వందలసార్లు అప్పీలు చేసినా అపాయింట్ మెంట్ మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో పాటు తాను కూడా ఉద్యమించానని, ఆయన ఆమరణ దీక్షకు దిగితే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది తానేనని గుర్తు చేశారు. అలాంటి తనకు కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు.

నాలుగేళ్ల ఈ తెలంగాణ ప్రభుత్వ పాలనలో దళితులు అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం జరిగేవరకు తన పోరాటం కొనసాగిస్తానని మంద కృష్ణ మాదిగ తెలిపారు. 

click me!