MP Arvind : ఎన్నికల ప్రచారంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్ .. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శాస్త్రాలు సంధించారు. గొర్లను మింగేటోడు ఒక్కడయితే, బర్లను మింగేటోడు మరొకడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇంతకీ గొర్లను మింగేటోడెవరు? బర్లను మింగేటోడేవరు?
Aravind: రోజురోజుకు తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆయా పార్టీ నేతల మధ్య నిత్యం మాటల యుద్దం జరుగుతోంది.అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శాస్త్రాలు సంధించారు. గులాబీ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎంపీ అరవింద్ ఇవాళ కోరుట్ల పట్టణంలో బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పేరుతో రూ. 80 వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపముందనీ, వీటిపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దోచుకోచుకోవడానికి వస్తున్నాయనీ, గులాబీ అధినేత కేసీఆర్ గొర్లను మింగేటోడయితే.. టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బర్లను మింగేటోడని విమర్శలు గుప్పించారు.
మరోవైపు టీపీడీ అధినేత చంద్రబాబుకు కూడా చురకలంటించారు. హైదరాబాద్ తానే కట్టినా అనే ప్రచారం చేసుకునే చంద్రబాబు ..తెలంగాణ ఎన్నికల బరిలో ఎందుకు నిలువలేదని, అభ్యర్థులను ఎందుకు పెట్టడం లేదని విమర్శించారు. అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడని మండిపడ్డారు.
అవినీతి కేసీఆర్ ను మించిన రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు కంట్రోల్ ఉంటాడని, చక్కెర ఫ్యాక్టరీలను నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముస్లింలను కూడా ఓట్లు వేయాలని కోరుతున్నామని, రానున్న కాలంలో ముస్లిం బస్తీలకు కూడా రోడ్ షో లు నిర్వహించామని అన్నారు.తాము కాన్సిలర్స్, కార్పోరేట్లను కొని రాజకీయాలు చేయడం లేదనీ, ప్రజలను నమ్మి రాజకీయాలు చేస్తామని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. తర్వలో కాంగ్రెస్ నేతలు భారీగా బీఆర్ఎస్ లో చేరతారని చెప్పారు. అందుకే రైతుల ఓట్లు వృధా కాకుండా బీజేపీని గెలిపించాలని కోరారు. తాను పసుపు బోర్డు కాస్త ఆలస్యమైన ఇచ్చిన మాట ప్రకారం నేరవేర్చనని, బీడీ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని తెలిపారు.