కామారెడ్డిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా నేతలకు క్లారిటీ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం థాక్రే. రేవంత్ రెడ్డి రెండు చోట్లా పోటీ చేయడం ఖరారైన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఆయనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా నిజామాబాద్ జిల్లా నేతలకు క్లారిటీ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం థాక్రే. శనివారం గాంధీభవన్‌లో నిజామాబాద్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఆయన ఈ మేరకు వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్‌లో పోటీకి సిద్ధంగా వుండాలని సీనియర్ నేత షబ్బీర్ అలీకి థాక్రే తెలిపారు. రేవంత్ రెడ్డి రెండు చోట్లా పోటీ చేయడం ఖరారైన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 6న కొడంగల్‌లో, ఈ నెల 8న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార పీఠం దక్కించుకోవడానికి తమ వద్దవున్న అన్ని ఆస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి తమ ముందున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నాయి. గత నెల వరకు కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు, పలు అధ్యయనాలు అంచనా వేశాయి.
కానీ, ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. కాంగ్రెస్, బీజేపీలన దెబ్బకొట్టే చర్యల్లో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా కనిపించారు. అసమ్మతి స్వరాలను సైతం పెద్దగా లేవనివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆ పార్టీని ఇరకాటంలో పడేసే విధంగా పరిస్థితులు మారుతున్నాయి.
వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ చరిష్మా బీఆర్ఎస్ కు కలిసివచ్చాయి. అయితే, మూడో సారి అంటే దాదాపు ఏ పార్టీకైనా కొంతవరకు ప్రజా వ్యతిరేకత కనిపించడం సాధారణమే. దీనిని అధిగమించడానికి కేసీఆర్.. ఎన్నికల షెడ్యూల్ కు ముందు పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. అయితే, వాటి వల్ల వెనుకబడిన వర్గాల్లోని మెజారిటీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం ప్రజా వ్యతిరేకత మరింతగా పెరిగింది. అందులో చెప్పుకునే వాటిలో దళిత బంధు ఒకటి. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారు, పార్టీ క్యాడర్ వ్యక్తులకు మాత్రమే ప్రయోజనాలు అందాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక రైతు రుణమాపీతో చాలా మంది రైతులు లబ్ది పొందినప్పటికీ.. ఇంకా కొంతమందికి రుణమాపీ కాలేదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి ఇందులోనూ పూర్తి స్థాయి ఫలితాలు అందించకపోవడం కూడా బీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. ఇక రెండు నెలల క్రిత సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మీ పథకంలో కూడా పార్టీ క్యాడర్ ను ముందుంచడం, వాస్తవంగా సాయం అవసరం ఉన్నవారికి ప్రయోజనాలు కల్పించలేదని క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. ఇందులో ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ కావడంతో ఇక్కడ కూడా పార్టీ క్యాడరే ప్రయోజనాలు అందుకుందనేది మరో ఆరోపణ.