
హైదరాబాద్: దళిత బంధును అడ్డుకోవడం సరికాదని ఆయన కోరారు. ఈ పథకం తీసుకొచ్చిన కేసీఆర్ ను అందరూ బలపర్చాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు. గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
రైతుబందులాగా దళిత బంధు మంచి పథకమని ఆయన ప్రశంసించారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందన్నారు.అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధును స్వాగతించాలని ఆయన కోరారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కేసీఆర్ కు ఒక్కరికే ఉందని ఆయన చెప్పారు. జాతీయ పార్టీలు ఇలాంటి పథకాలు తీసుకు వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు.
సమసమాజ స్థాపన జరగాలంటే ఈ రకమైన పథకం అవసరం ఉందన్నారు మోత్కుపల్లి నర్సింహులు. ఒక దళితునికి పది లక్షల ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక మొనగాడు కేసీఆర్ అని ఆయన అభినందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముధైర్యం ఉంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే మునుగోడులో కూడ టీఆర్ఎస్ విజయం సాధిస్తోందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎలా విజయం సాధించాడో అందరికీ తెలుసునన్నారు.
40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటెల రాజేందర్ కు పుట్టగతులు ఉండవన్నారు. ఈటెలను హుజురాబాద్ లో ప్రజలు బహిష్కరించాలన్నారు. వందల ఎకరాల భూములు రాజేందర్ చేతుల్లో ఉన్నాయని తెలిసి తాను ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. దేవాలయాల భూములు, అసైన్డ్ భూములను రాజేందర్ వెంటనే వాపస్ ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే తాను హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహించి ఈటలను ఓడిస్తానని ఆయన చెప్పారు. ఈటెల రాజేందర్ బావమరిది దళితులు బూతులు తిట్టడం సరికాదన్నారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటెలను నమ్మొద్దన్నారు.