
మేడ్చల్ : తెలంగాణలోని Medchal Districtలో విషాదం చోటు చేసుకుంది. ఓ Married womanతన ముగ్గురు పిల్లలతో కలిసి suicide attemptకి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు బతికి బయటపడగా, ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. క్షణికావేశంలో తాను చనిపోవడమే కాకుండా ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా తనతో పాటు తీసుకువెళ్లింది ఆ తల్లి. తాను లేకపోతే చిన్నారుల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన, భర్త సరిగా చూసుకుంటాడో లేదోనన్న భయం ఆమెను ఈ దారుణానికి ఒడిగట్టేలా చేశాయి. వివరాల్లోకి వెడితే..
భర్త వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. తాను చనిపోతే పిల్లల్ని భర్త చూసుకోడనే ఉద్దేశ్యంతో పిల్లలతో సహా చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు. మేడ్చల్ పోలీస్ ఠాణా పరిధిలో ఈ విషాదం బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రహ్మణపల్లి భిక్షపతి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ మండలం నూతన్ కల్ గ్రామానికి చెందిన శివరాణితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముద్దులొలికే ముగ్గురు పిల్లలు.. జగదీష్ (5), దీక్షిత్ (3), ప్రణీత (1) ఉన్నారు. కొద్దినెలలుగా భార్యభర్తల పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్తానంటూ...
బుధవారం ఉదయం కూడా వారి మధ్య మాటామాటా పెరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో భర్త పనికి వెళ్లిన తరువాత తన ముగ్గురు పిల్లలతో కలిసి.. పెద్ద కుమారుడు జగదీష్ ను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్తున్నానని. మరిది రమేష్ తో చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. అయితే 10 గంటల వరకూ వదిన ఇంటికి రాకపోవడంతో రమేష్ సోదరుడికి సమాచారమిచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి చుట్టుపక్కల వెతికారు. కాగా, శివరాణి చెరువు పక్కన కనిపించిందని స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద కుమారుడు జగదీష్ చెరువు గట్టుపై ఏడుస్తూ కన్పించడంతో ఆరాతీశారు. ‘అమ్మ, తమ్ముడు, చెల్లి నీళ్లలో ఉన్నారని’ ఏడుస్తూ చెప్పడంతో చెరువులో గాలించారు. ముగ్గురి మృతదేహాలనూ బయటికి తీశారు. విషయం తెలుసుకున్న శివరాణి తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని భిక్షపతి, అతడి కుటుంబ సభ్యులను చితకబాదారు. పోలీసులు వారిని అదుపుచేశారు.
అమ్మ నీళ్లు తాగుదామని తీసుకొచ్చింది...
‘బడికి కాకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావని అమ్మను అడిగా.. చెరువులో నీళ్లు బాగుంటాయని, తాగుదామని చెప్పింది. చెరువు దగ్గరికి వచ్చాక నన్ను, చెల్లిని, తమ్ముడిని అమ్మ కొంగుకు కట్టుకుని చెరువులోకి దూకింది. ముడి విడిపోవడంతో నేను గట్టుపైన పడ్డా, అప్పట్నుంచి అరుస్తూనే ఉన్నా. నీళ్లల్లోంచి వారు పైకి రాలేదని’ చిన్నారి జగదీష్ తాతకు ఏడుస్తూ చెప్పడం అక్కడి వారిని కలిచివేసింది. తన కుమార్తెను కొన్ని రోజులుగా అల్లుడు వేధిస్తున్నాడని, బుధవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని శివరాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.