మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..

By Sumanth KanukulaFirst Published Nov 10, 2022, 10:42 AM IST
Highlights

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజీలను రెండు రోజుల కస్టడీకి నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజీలను రెండు రోజుల కస్టడీకి నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని పోలీసులను ఆదేశించింది. అలాగే న్యాయవాది సమక్షంలో విచారించాలని షరతు విధించింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సైబరాబాద్ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు జైలుకు తీసుకురానున్నారు. శుక్రవారం కూడా పోలీసులు ముగ్గురు నిందితులను విచారించనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మెయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఘటనపై దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్) కల్మేశ్వర్ శింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ ఏసీపీ బి గంగాధర్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం నిందితులను విచారించనుంది. 

ఇక, తెలంగాణ హైకోర్టు మంగళవారం మెయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఘటన దర్యాప్తుపై స్టేను తొలగించింది. ఈ క్రమంలోనే ఏసీబీ ప్రత్యేక కోర్టులో పోలీసులు నిందితులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే కోర్టు నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక, ఈ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజీల బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 11కు వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు బుధవారం తెలిపింది. 

click me!