
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పరాన్నజీవిగా మారిందని ఎద్దేవా చేశారు. దేశానికి నాయకుడిని అవుతానని చెబుతున్న కేసీఆర్.. మునుగోడులో తన కాళ్లపై తాను నిలబడలేకపోయారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్ బయటి వ్యక్తులపై, డబ్బుపై ఆధారపడుతోందని ఆరోపించారు.
మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు సాంకేతిక విజయం మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్ సొంతంగా గెలవలేదని అన్నారు. మునుగోడులో కమ్యూనిస్టుల సాయం తీసుకోవడం ద్వారా తనంతట తానుగా గెలిచే శక్తి లేదని కేసీఆర్ ఒప్పుకున్నట్టేనని అన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం బయటి శక్తులపై ఆధారపడే దయనీయ స్థితికి చేరుకుందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే తమ పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం అని అన్నారు.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని మహాసభ (మహాభారతం)లో పాండవుల ఓటమితో పోల్చిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ పతనానికి ఇది పునాది కానుందన్నారు. అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని.. ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు పంచిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు.. మద్యం మత్తులో మునుగోడు నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చాయని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి 300 కోట్లు ఖర్చు చేసి ప్రజలతో తాగించారని ఆరోపించారు.
ఇందులో కాంగ్రెస్ పాత్ర లేదని చెప్పడానికి గర్వపడుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఫలితాలతో తాను సంతృప్తి చెందానని చెప్పారు. తమ పార్టీ శ్రేణుల పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నట్టుగా తెలిపారు. వారి పోరాట శైలిలో ఎలాంటి లోపం లేదని అన్నారు. డబ్బులు, ఒక్క చుక్క మద్యం కూడా పంచకుండా కాంగ్రెస్‌కు 24 వేల ఓట్లు వచ్చినందుకు గర్విస్తున్నానని తెలిపారు. జేపీ నడ్డా, అమిత్ షా, సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్, తరుణ్ చుగ్ వంటి బీజేపీ అగ్రనాయకత్వం కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేందుకు మునుగోడులో మకాం వేసిందని విమర్శించారు. మునుగోడులో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ను మట్టికరిపించారని అన్నారని.. ఆయన ఒక స్థానిక నాయకుడిలా మాట్లాడుతున్నారని అని విమర్శించారు. మునుగోడులో బీజేపీ ఓటమిని సమీక్షించే బదులు కాంగ్రెస్ ఓటమికి ప్రధాని మోదీ సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ దోస్తీ ఉందని ఇది రుజువు చేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని.. కాంగ్రెస్‌ను చంపడమే వారి లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపిందని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీల నిజ స్వరూపాన్ని ప్రజలకు బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో త్వరలో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు.