నెహ్రూను అవమానిస్తే వూరుకోం

First Published Nov 14, 2016, 9:39 AM IST
Highlights

 నెహ్రూను తక్కువ చేసి చూపేందుకు  మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది- తెలంగాణా కాంగ్రెస్

భారత తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను విస్మరించి అవమాన  పరిచే విధంగా కేంద్రం ప్రవర్తిస్తూ ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది. 127వ నెహ్రూ జయంతిని పురష్కరించుకుని, సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్‌ అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం ఎదుట నిరసన కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం నాగేందర్‌ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 బాలల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో నెహ్రూ చిత్రపటాన్ని పెట్టకపోవడం క్షమించరాని చర్య అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డివిమర్శించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, తొలి ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలోకినడిపించిన నెహ్రూను విస్మరించడం బాధాకరం అని అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నెహ్రూను కించపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. బాలల దినోత్సవానికి ఇచ్చిన ప్రకటనల్లో నెహ్రూ ఫొటో లేకపోవడం అనేది కావాలనే నెహ్రూ  తక్కువ చేసి చూపించే కుట్రలో భాగమని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమయం వచ్చినపుడు మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

 ఈ కార్యక్రమంలో అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడు కె. జనారెడ్డి, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

click me!