మోదీ.. హిమాలయన్ బ్లండర్

First Published Dec 13, 2016, 11:32 AM IST
Highlights

పెద్ద నోట్ల రద్దుపై జైపాల్ రెడ్డి ఫైర్

ప్రధాన మంత్రి అనుభవ రాహిత్యంతో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్లు రద్దు ప్రకటన ఘోర తప్పిదమని అభివర్ణించారు.

 

మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద నోట్లు రద్దు చేసి మోదీ హిమాలయన్ బ్లండర్ చేశారని ధ్వజమెత్తారు.

 

‘దేశ ఆర్థికరంగంలో ఎన్నో పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ఏ ఒక్క పొరపాటు కూడా ఇంత పెద్దది కాదు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం అతి పెద్ద తప్పు (హిమాలయన్‌ బ్లండర్‌) ’ అని పేర్కొన్నారు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలి 19 రోజుల్లోనే  80 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 105 సార్లు నిబంధనలు మార్చారని పేర్కొన్నారు. బ్లాక్ మనీ నియంత్రణకే  నోట్ల రద్దు చేపట్టినట్లు కేంద్రం చెప్పడం అవాస్తవమని అన్నారు.

 

దేశంలో రూ. 500, రూ. 1000ల నోట్లు మొత్తం రూ. 14.18 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు తిరిగి  రూ.14లక్షల కోట్లు బ్యాంకులకు చేరాయని దీని బట్టి... నల్లధనం మిథ్య.. దాన్ని పట్టుకోవడం మిథ్యనే అని విమర్శించారు.

 

గతంలో బ్లాక్ మనీ నియంత్రణకే నోట్లు రద్దు అని చెప్పిన ప్రధాని ఇప్పుడు  క్యాష్‌లెస్‌ ఎకానమీ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులే అధికంగా నష్టపోయారని అన్నారు.

click me!