కేసీఆర్ హ్యాపీ: కొత్త జోనల్ వ్యవస్థకు మోడీ గ్రీన్ సిగ్నల్

By pratap reddyFirst Published Aug 26, 2018, 9:36 AM IST
Highlights

తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ప్రధానితో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సాయంత్రం 23 నిమిషాల సేపు భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ప్రధానితో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సాయంత్రం 23 నిమిషాల సేపు భేటీ అయ్యారు. జోనల్ వ్యవస్థకు సంబంధించిన సమస్యపై కేసీఆర్ మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రయత్నించినప్పుడు జోనల్‌ వ్యవస్థ పెండింగ్‌లో ఉన్న కారణంగా హైకోర్టు కొట్టేసిన విషయాన్నికేసీఆర్ మోడీకి వివరించారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పోస్టు నుంచి ఏ నియామకం జరపాలన్నా జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలపడం అవసరమని, కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి ఆ వెంటనే కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలుపుతూ ఫైల్ పై సంతకం చేసినట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి సంతకం చేసిన విషయాన్ని కేసీఆర్‌ అధికారులు, పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రధానితో భేటీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్‌నేత బి.వినోద్‌కుమార్‌ మీడియాతో అదే విషయం చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి జోనల్‌ అంశం అడ్డంకిగా మారినందున, దానికి కేంద్రం తక్షణం ఆమోదముద్ర వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తికి ప్రధాని అంగీకరించినట్లు తెలిపారు. అందకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేసినట్లు కూడా తెలిపారు. 

రెండు మూడు రోజుల్లో దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడతాయని చెప్పారు. 15 రోజుల క్రితం ప్రధానమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి జోనల్‌ వ్యవస్థ గురించి ప్రధానంగా చెప్పారని, వెంటనే దాన్ని క్లియర్‌ చేస్తామని ఆ రోజు మోడీ హామీ ఇచ్చారని కూడా వివరించారు. ఇప్పటికీ ఆ పని జరగకపోవడంతో మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి సమస్య తీవ్రతను వివరించి అంగీకరింపజేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఈ వార్త చదవండి

జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

click me!