డబ్బాల్లో కోటి రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చారు: కెసిఆర్ పై రేవంత్

By pratap reddyFirst Published Aug 25, 2018, 8:48 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసిఆర్ ఇచ్చిన డబ్బాల్లో డబ్బులు ఉన్నాయని ఆయన అన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసిఆర్ ఇచ్చిన డబ్బాల్లో డబ్బులు ఉన్నాయని ఆయన అన్నారు. 

ఒక్కో ఎమ్మెల్యేకు కేసీఆర్ రూ. కోటి ఇచ్చారని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమతో చెప్పారని అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 
కేసీఆర్‌కు అధిష్టానం ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ బీజేపీ శాఖ అని విమర్శించారు. కేసీఆర్ అధిష్టానం గల్లీలో ఉంటే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
కేసీఆర్‌కు సహానీ అనే చీకటి స్నేహితుడొకరు ఉన్నారని, ఢిల్లీలో ఉండే ఆ సహానీ లీలలు బయటపెట్టాలని అన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ గూడుపుఠాణి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సమావేశానికి 25 లక్షల మంది వస్తారంటూ కేసీఆర్ ఊదరగొడుతున్నారని వ్యాఖ్యానించారు. 2 లక్షల మందిని కేసీఆర్ 25 లక్షలుగా చూపుతారని అన్నారు. గ్రామాలకు వెళ్లే ముఖం లేక హైదరాబాద్‌లో సభతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
 
ఇంతమంది.. అంతమంది వస్తారంటున్న కేటీఆర్‌ తన సొంత నియోజకవర్గం నుంచి 25 వేల మందిని అయినా తీసుకురాగలరా అని అడిగారు. చెక్ పోస్ట్ పెడితే ఆ విషయం తేలిపోతుందని అన్నారు. చెక్ పోస్ట్ దగ్గర 25 వందల వాహనాల నంబర్స్‌ వాట్సప్‌లో పెట్టాలని, దీనికి కేటీఆర్ సిద్ధమేనా సవాల్ విసిరారు.
 
గ్రామ సభ నిర్వహిస్తే ప్రజలు టీఆర్ఎస్ నేతల బట్టలూడదీసి పంపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో కొత్తవారికి టికెట్లు ఇస్తే.. పాతవారు ఓడిస్తారని, ఇప్పుడున్నవారికి ఇస్తే.. ప్రజలు ఓడిస్తారని అన్నారు. మొత్తంగా టీఆర్ఎస్ ఓటమి ఖాయమని అన్నారు. 

click me!