
MLC Kavitha: గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత వర్ష బాధితులను అప్రమత్తం చేస్తూ.. వారికి చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారు అని ట్విట్ చేశారు.
మరో ట్విట్ లో.. ప్రసవానికి వారం గడువున్న గర్భిణులకు కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్, త్రాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. ఒక వైపు ప్రభుత్వం మరోవైపు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటు, ఆహార పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారనీ, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలోని జాగృతి కార్యకర్తలు నిజామాబాద్ జిల్లాలోని వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు.లోతట్టు ప్రాంతాల వారికి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు జాగృతి కార్యకర్తలు, నాయకుల ద్వారా ఎప్పటి కప్పుడు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే.. నగరంలోని ధర్మపురి కాలనీ నాగారం, రైల్వే స్టేషన్ బస్టాండ్లలో జాగృతి కార్యకర్తలు పలువురికి భోజనాన్ని అందిస్తున్నారు. గత ఏడాది కూడా భారీ వరదల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నవారి కవిత ఆదుకున్నారు.