
మంచిర్యాల జిల్లాలో గోదావరిలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు పోలీసులు. ఎడ్ల కోసం గోదావరి ఒడ్డుకు వెళ్లిన గట్టయ్య , సారయ్యలు సోమనపల్లిలో వరద నీటిలో చిక్కుకున్నారు. దీంతో దగ్గరలోని వాటర్ ట్యాంక్ ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి వాటర్ టాంక్ పైనే వున్నారు ఇద్దరు బాధితులు. దీంతో హెలికాఫ్టర్ ద్వారా వారిని రక్షించారు అధికారులు.
కాగా.. మంచిర్యాల పట్టణంలో వరద నీరు ముంచెత్తింది. మరో వైపు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ,, రాం నగర్, పద్మశాలీ కాలనీ సహా పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. రాళ్లవాగు,తోళ్లవాగుల నుండి వరద నీరు మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలను ముంచెత్తాయి. వీటి కారణంగానే మరింత వరద పట్టణంలోకి వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 54 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్దుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 54 గేట్లు ఎత్తి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీరు ముంచెత్తడంతో ఇప్పటికే మంచిర్యాల, నిజామాబాద్ మధ్య రాకపోకలునిలిచిపోయాయి. మరోవైపు మంచిర్యాల నిజామాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం సమీపంలోని ఇంటిలో ఓ వ్యక్తి నిన్న చిక్కుకున్నారు. తనను కాపాడాలని ఆయన ఆర్తనాదాలు చేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయతే ఇవాళ్టికి ఈ ప్రాజెక్టుకు వరద తగ్గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టు సేఫ్ అంటూ ప్రకటించారు.