
హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య రాజకీయం రచ్చకెక్కింది. కడియం శ్రీహరిని వ్యతిరేకిస్తూ తాటికొండ రాజయ్య మద్దతుదారులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి వద్దంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గ పరిధిలో కరుణాపురం వద్ద హన్మకొండ, హైదరాబాద్ రహదారి పై వారు బైఠాయించారు.
స్థానిక నాయకుడు ముద్దు.. వలసదారులు వద్దు అంటూ రాజయ్య మద్దతుదారులు నినాదాలు చేశారు. దళిత దొర వద్ద, దళిత బిడ్డ రాజయ్య ముద్దు అని అన్నారు. ఈ నినాదాలు చేస్తూ కడియం శ్రీహరి దిష్టి బొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు. దీంతో చిల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్, మరికొంత మంది సిబ్బందితో వచ్చి దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు తోపులాట జరిగింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇప్పటి వరకు అవినీతి జరగలేదని, దళితుల ముద్దు బిడ్డ అని ఆయన మద్దతుదారులు అన్నారు. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడుల్లా కడియం శ్రీహరి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడని, ఆయనకు ఇక్కడ మద్దతు లేదని తెలిపారు. కావాలనే పార్టీలోని తోటి నేతపై ఆయన బుదరజల్లుతాడని పేర్కొన్నారు. తమకు కేసీఆర్, కేటీఆర్‌లపై నమ్మకం ఉన్నదని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ టికెట్ తాటికొండ రాజయ్యకే వస్తుందని విశ్వసిస్తున్నట్టు వివరించారు.
Also Read: టికెట్ 100 శాతం నాకే వస్తుంది.. లిస్ట్ వచ్చేదాకా ఆగండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిన్న సమావేశమైన కడియం శ్రీహరి .. తాటికొండ రాజయ్యపై విమర్శలు చేశారు. మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే.. తల దించుకుని సిగ్గుపడే పరిస్థితి ఉన్నదని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే మీరంతా సహకరించాలని కోరారు. సిట్టింగ్‌లు మారే నియోజకవర్గాల్లో స్టేషన్ ఘనపూర్ కూడా ఉన్నదని ఆయన అన్నారు. దీంతో తాటికొండ రాజయ్య మద్దతుదారులు ఆగ్రహిస్తున్నారు.