
తెలంగాణ అమరవీరుల విషయంలో టిఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్య వైఖరితో ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన సర్కారుకు ఒక లేఖ రాశారు. టిడిపిలో ఉండగా చాలా లేఖలు రాసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలి లేఖను ఇవాళ కేసిఆర్ కు రాశారు. ఆ లేఖను యదాతదంగా కింద ప్రచురిస్తున్నాం.
తేదీః13.11.2017
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,
తెలంగాణా రాష్ట్రముఖ్యమంత్రి
హైదరాబాద్.
విషయంః తెలంగాణా అమరవీరుని కుటుంబానికి ఇప్పటివరకూ ఎలాంటి సహాయం అందకపోవడం గురించి.
మీ ప్రభుత్వం ఏర్పడి 40 నెలలు దాటిపోతున్నా తొలి,మలి ఉద్యమంలో తెలంగాణా కోసం ప్రాణాలర్పించిన 1569 మంది వివరాలను సేకరించలేకపోవడం మీ నిర్లక్ష్యం తప్ప మరేమీకాదు.అమరవీరుల కుటుంబీకులు తమకు ప్రభుత్వం నుంచి సహాయం చేయాలని కోరుతూ ఆయా జిల్లాలలో అధికారులకు అర్జీలను సమర్పిస్తున్నా, అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపిస్తున్నా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకు ఒక ఉదాహరణను ఇస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు కె.సాయాగౌడ్ కుటుంబం పడుతున్న ఆవేదన. నిజామాబాద్ జిల్లా నాగారం గ్రామంలోని భారత్‌నగర్ కాలనీకి చెందిన సాయాగౌడ్ (20) తెలంగాణ రాష్ట్రసాధన కోసం నిర్వహించిన మిలియన్ మార్చ్ కు వెళ్లలేకపోయానన్న ఆవేదనతో 2011 మార్చి 10వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని తనను తాను దహించుకున్నాడు. తీవ్రగాయాలతో జై తెలంగాణా అంటూ నినదిస్తూ మూడురోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించాడు. తెలంగాణా రాష్ట్రసాధన కోసమే సాయాగౌడ్ ఆత్యహత్య చేసుకున్నాడని నిజామాబాద్ 5వ పట్టణ పోలీసులు కూడా నిర్ధారించి దీనిపై 33/2011 నెంబరుతో కేసు కూడా నమోదు చేసారు. అమరవీరుడు సాయాగౌడ్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు.అతను మరణించేనాటికి అతని కుటుంబంలో అతని చెల్లి ప్రసన్న మాత్రమే ఉంది. తాను కూలీ పనులు చేస్తూ తన చెల్లిని పోషిస్తున్న సాయాగౌడ్ తెలంగాణా కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన తర్వాత అతని కుటుంబంలో మిగిలిన చెల్లి ప్రసన్న ఇప్పటికి కూడా ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది.ఇప్పటికే తాను అనేకసార్లు అధికారులకు అర్జీలు కూడా ఇచ్చింది.సాయాగౌడ్ ఆత్మబలిదానం గురించి నిజామాబాద్ పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపుతూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
2016లో సాయాగౌడ్ చెల్లెలు ప్రసన్న ఇచ్చిన దరఖాస్తుకు స్పందించిన నిజామాబాద్ కలెక్టర్ 2017, జనవరి 1న ప్రిన్సిపల్ సెక్రటరీకి మళ్లీ నివేదికను పంపినా ఇప్పటిదాకా ప్రభుత్వంలో చలనం లేదు..ప్రసన్నకు ప్రభుత్వసహాయం అందనూ లేదు. దీనికి సంబంధించి ప్రసన్న నాకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని, పోలీసులు కలెక్టర్‌కు ఇచ్చిన రిపోర్టుకాపీని, ప్రభుత్వానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా పంపిన రిపోర్టును కూడా ఈ లేఖతోపాటు మీకు పంపుతున్నాను. తెలంగాణా రాష్ట్రంలో ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నా వారికి సహాయం అందించడంలో నిర్లక్ష్యం మంచిది కాదు. రాష్ట్రంలో సహాయం అందించాల్సిన అమరవీరుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీలతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించండి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక రోజు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అందించిన సహాయంపై చర్చించండి, అధికారికంగా మీరూ ఒక ప్రకటన చేయండి.తక్షణం ఈ వ్యవహారంపై స్పందించండి.
(ఎ.రేవంత్ రెడ్డి)