
గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విద్వేపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రాజా సింగ్‌పై ఉన్న విద్వేషపూరిత ప్రసంగం ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. గతంలో రాష్ట్ర అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన ప్రసంగాల రికార్డులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఆ ప్రసంగాల్లో ఉన్న వాయిస్‌ను.. ఆయన ఆగస్టు 22న విడుదల చేసిన వీడియోలోని ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వాయిస్‌తో పోల్చిచూడనున్నారు.
‘‘రెండు శాంపిల్స్‌లోని వాయిస్ ఒకే వ్యక్తికి చెందినదా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో పరీక్షించబడుతుంది. ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వీడియో ఎడిట్ చేయబడిందా? లేదా మార్పు చేయబడిందా? లేదా ఒరిజినల్ వెర్షన్‌లోనే ఉందా? అనేది తనిఖీ చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో పరీక్షించబడుతుంది. ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వీడియో నిజమైనదా? కాదా? అని ల్యాబ్‌లో తేలనుంది. అది ఒరిజనల్ అయితే.. కోర్టులో అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది’’ అని దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక అధికారి చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్ పేర్కొంది.
ఇందుకోసం.. అసెంబ్లీలో రాజాసింగ్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులను కోరుతూ పోలీసులు గతంలో అసెంబ్లీ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వీడియో క్లిప్పింగ్‌లు యూట్యూబ్ నుంచి తొలగించినప్పటికీ.. పోలీసులు సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి వీడియో క్లిప్‌లను తిరిగి పొందారు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను భద్రపరిచారు. ఈ రెండు వీడియోలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించిన పోలీసులు.. వాయిస్ నమూనాలపై తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
రాజా సింగ్ ఆగస్టు 22న విడుదల చేసిన వీడియోలో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నిరసనలు చెలరేగాయి. పోలీసులు మొదట రాజా సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ.. రిమాండ్ ప్రక్రియలో లోపాలను పేర్కొంటూ నాంపల్లి కోర్టు అతన్ని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు.