కరీంనగర్ లో 108 వాహనంలోనే మహిళ ప్రసవం.. పురుడు పోసిన సిబ్బంది...

By Bukka Sumabala  |  First Published Sep 3, 2022, 6:33 AM IST

కరీంనగర్ లో ఓ మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. కాన్పుకోసం తరలిస్తుండగా నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆ మహిళకు పురుడు పోశారు. 


కరీంనగర్ జిల్లా : కాన్పు మహిళలకు రెండో జన్మ అంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా సమయానికంటే ముందే కాన్పు రావడం.. అసలు పురిటినొప్పులు అని తెలుసుకునేలోపే.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రసవం అయిపోవడం జరగుతుంటాయి. అలా బస్సుల్లో, విమానాల్లో, అంబులెన్సుల్లో.. ఆస్పత్రి బయట డెలివరీ అవుతుంటారు. అలా కరీంనగర్ లో ఓ మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. 

కరీంనగర్ హుజూరాబాద్ పట్టణంలోని సిర్సాపల్లి క్రాస్ రోడ్ వద్ద 108 వాహనంలోనే ఓ మహిళ ప్రసవించింది. పురుటి నొప్పులు రావడంతో కాన్పుకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.. నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది ఆ మహిళకు వాహనంలోనే పురుడు పోశారు. ఆ మహిళ మధ్య ప్రదేశ్ కు చెందినదిగా సమాచారం.  

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే అదిలాబాద్ లో జూన్ 27న జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ ఆదివాసీ మహిళకు  ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది.  బస్సు డ్రైవరే డాక్టర్ అయ్యాడు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సింగరి వాడకి చెందిన గర్భిణీ మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి అదిలాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది.

గుడిహత్నూర్ మండలం మనకాపూర్ వద్దకు రాగానే పురుటి నొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఆర్టీసీ బస్సులోనే ఆదివాసి మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.బస్సును ఆపేసిన తరువాత.. 108కి ఫోన్ చేసినా.. వాహనం సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి తల్లీబిడ్డలను అక్కడ చేర్పించాడు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు అందరూ సంతోషించారు.  సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్  ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవిత కాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్ పాస్ అందిస్తామని తెలిపారు.తల్లీబిడ్డలు సురక్షితంగా ఆస్పత్రికి తరలించిన బస్సు డ్రైవర్ కండక్టర్ సిహెచ్ గబ్బర్సింగ్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,  సీఎండీ సజ్జనార్ అభినందించారు.  ఆ బిడ్డకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని కోరుకున్నారు.

click me!