
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై విపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై స్పందించారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతానని చెప్పారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో తమ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని పలుమార్లు ప్రభుత్వాన్ని విమర్శించామని చెప్పారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేకుండా పనిచేయదని తెలిపారు.
అయితే గత కొంతకాలంగా జగ్గారెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్‌లను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాశారు. అయితే జగ్గారెడ్డిని బుజ్జగించడానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు జరిపారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీఎల్పీ భేటీ జరుగుతుండగా జగ్గారెడ్డి మధ్యలోనే బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు జగ్గారెడ్డి కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారlr కాంగ్రెస్‌లోని ఓ వర్గం చెబుతోంది. కావాలనే రాష్ట్ర నాయకత్వంపై జగ్గారెడ్డి బురద జల్లే ప్రయత్నాలు చేస్తుున్నారని మండిపడుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ భర్తీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేయడం.. కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతానని ప్రకటించడం.. కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
ఇక, ఈరోజు అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా తక్షణమే నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు.