రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం : ముగ్గురు కూలీల ఆచూకీ భవనంలోనే.. సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడే...

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 12:13 PM IST
Highlights

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో ఆచూకీ తెలియని ముగ్గురు కూలీల సెల్ ఫోన్ సిగ్నల్స్ బిల్డింగ్ లోనే చూపిస్తున్నాయి. దీంతో వీరు మంటల్లో చిక్కుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మినిస్టర్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో ఆరు అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది.  డెక్కన్ మాల్ భవనంలో 12 గంటలకు పైగానే మంటలు ఎగిసిపడడంతో లోనికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడి భవనం పూర్తిగా దెబ్బతింది. కాగా భవనంలో ఉన్న ముగ్గురు కూలీల ఆచూకీ తెలియడం లేదు. బీహార్ కు చెందిన జునైద్, వసీం, అక్తర్ లు భవనంలోనే చిక్కుకుపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

వీరి దగ్గర ఉన్న సెల్ ఫోన్ లొకేషన్లు మంటలు చెలరేగుతున్న భవనంలోనే చూపిస్తున్నాయి. దీంతో  పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఆచూకీ దొరకని కూలీలు ముగ్గురు ఆ భవనంలోనే కనక ఉన్నట్లయితే ఇప్పటికే సజీవ దహనమై ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆచూకీ లభించని కూలీల కోసం సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద పెద్ద క్రేన్ ల సహాయంతో భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థత, భవనం కూల్చివేసే చాన్స్

అగ్ని ప్రమాద ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతింది. దీంతో భవనాన్ని కూల్చే దిశగా అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆచూకీ లభించని కూలీల కోసం గాలింపు పూర్తయితే భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అగ్నిమాపక  సిబ్బందిలో ఇద్దరు ఈ అగ్ని ప్రమాదక సహాయక చర్యల్లో  పాల్గొని అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఎడిఎఫ్ఓ ధనుంజయ రెడ్డి, ఫైర్ ఇంజన్ డ్రైవర్ నర్సింగరావుగా గుర్తించారు.  వీరిద్దరూ గురువారం అష్టతకు గురయ్యారు. 

వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నర్సింగరావుకు వెంటిలేటర్ పై ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురిని  రక్షించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం  నిబంధనలకు విరుద్ధంగా భవనం ఉండడం, భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడమేనని  అందులో పేర్కొన్నారు.  భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ  రహీంలు ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. 

డెక్కన్ మాల్ లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో భవనం పూర్తి కుప్పకూలే ప్రమాదం ఉండడంతో.. భవనం సమీపంలోకి ఎవ్వరూ వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవ్వరూ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవనం సెల్లార్లో ఇంకా ఎవరైనా చిక్కుకునిపోయారా అనే దానిమీద స్పష్టత రాలేదు.  భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉన్న నేపధ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని జిహెచ్ఎంసి ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. 

click me!