
హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. మైనర్లు కూడా పబ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన.. పబ్‌ల యజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. ఇటీవల జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకోవడం.. ఆ తర్వాత జరిగిన దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్‌లోని మరో పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో రెండు రోజుల పాటు మైనర్లు పార్టీ చేసుకన్నట్టుగా కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ పార్టీకి అనుమతి నిరాకరించినప్పటికీ.. ఓ బడా నేత ప్రమేయంతో పార్టీకి అనుమతి లభించిందని తెలుస్తోంది.
దీంతో పార్టీ నిర్వహకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్లను ఆహ్వానం అందించారు. సైబర్ అవర్స్ వాల్యూమ్ II పేరుతో పార్టీని నిర్వహించారు. అయితే ఈ పార్టీలో పెద్ద సంఖ్యలో మైనర్లు పాల్గొన్నప్పటికీ.. ఎంతమంది పాల్గొన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పబ్‌లో మైనర్లకు మద్యం సరఫరా చేయలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత.. మైనర్లను పబ్‌ల్లోకి అనుమతిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో కొందరు నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు పబ్‌లు, క్లబ్‌లు 21 ఏళ్లలోపు వారిని అనుమతించబోమని వెల్లడించాయి. 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం అంటూ పబ్ ల ముందు బోర్డులు వెలిశాయి. 21 ఏళ్ల లోపు ఉన్నవారు ఒక్కరున్నా.. గ్రూప్, కుటుంబ పార్టీలకు పబ్ లు నో చెబుతున్నాయి. కొన్ని పబ్ లు పదేళ్ల లోపు పిల్లలను పెద్దలతో కలిసి లంచ్ పార్టీలకు అనుమతిస్తున్నాయి.
కాకపోతే ఎక్కువ శాతం పబ్ లు పెద్దలకు మాత్రమే ప్రవేశం అన్న నిబంధనలు పాటిస్తున్నాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత పబ్ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు.. ఎవరికీ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నట్లు ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు.