
నిజామాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు 9 ఏళ్ల బాలిపై అత్యాచారం చేశాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 35 ఏళ్ల నారాయణ అనే వ్యక్తి బాలికకు పండ్ల రసం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే బాలిక తనపై జరిగిన దాడి గురించి తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో నారాయణపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నారాయణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నారాయణను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు జార్ఖండ్‌లోని కుంటీలో పదేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. నిందితులందరూ మైనర్లు కావడం శోచనీయం. వివరాల్లోకెళ్తే.. కుంటీలోని తప్కారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పదేండ్ల బాలిక తన పక్క గ్రామంలో ఏప్రిల్ 19న జరిగిన వివాహ వేడుకకు హాజరైంది. ఈ క్రమంలో బాధితురాలికి, నిందితులకు వివాహం దగ్గర గొడవ జరిగింది. దీంతో బాధితురాలు ఇంటికి ఒంటరిగా వస్తున్న సమయంలో బాలికను అడ్డగించిన నిందితులు.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి.. గ్యాంగ్ రేప్ చేశారు. ఎలాగోలా వారి నుంచి బయటపడ్డ బాలిక ఆ తర్వాత ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తొలుత.. గ్రామస్థులలో ఒక వర్గం ఈ విషయాన్ని పంచాయతీ స్థాయిలో చేపట్టేందుకు ప్రయత్నించారు.కానీ, బాధిత కుటుంబీకులు న్యాయం జరుగుతుందనే విశ్వాసం లేకపోవడంతో .. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇక, దేశంలో మహిళలు, చిన్నారుల రక్షణకు కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడోచోట.. అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.