తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు .. ఎక్కడెక్కడంటే..?

By Siva Kodati  |  First Published Oct 24, 2023, 8:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించనున్న పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 26న నాగర్ కర్నూలుకు బదులుగా వనపర్తిలో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. అందరికంటే 2 నెలల ముందే 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో నేతలు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి వెళ్లేందుకు వీలు కుదిరింది. అటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా మరోసారి తన వాగ్ధాటి, వాడి వేడి విమర్శలతో విపక్షాలపై విరుచుకుపడుతూ.. మరోసారి తాను ఎందుకు గెలవాలో ప్రజలకు తెలియజేస్తున్నారు. 

ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ వుండటంతో ఆయన కూడా స్పీడ్ పెంచారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు షెడ్యూల్ సైతం విడుదల చేశారు. అయితే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 26న నాగర్ కర్నూలుకు బదులుగా వనపర్తిలో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 27న స్టేషన్ ఘన్‌పూర్‌కు బదులుగా మహబూబాబాద్, వర్ధన్నపేటల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మిగతా పర్యటనలన్నీ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. 

Latest Videos

కాగా.. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం (అక్టోబర్ 26) నుంచి కేసీఆర్ మరోసారి సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. తొలి విడత మాదిరిగానే.. ఒక రోజులో 2 లేదంటే 3 సభలకు కేసీఆర్ హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఈ విడతలో 30కి పైగా సభల్లో కేసీఆర్ పాల్గొనున్నారు. 

ALso Read: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో వేయకపోవునా?:హరీష్ రావు

ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ ముందుగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ బహిరంగసభల్లో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు. అనంతరం శుక్రవారం (అక్టోబర్ 27) రోజున పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో ఎన్నికల సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.  అక్టోబర్ 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందులలో ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురిలో బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 3వ తేదీన ముథోల్, ఆర్మూర్‌, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. 

నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలలో, నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట్, నవంబర్ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, అసిఫాబాద్, బెల్లంపల్లిలలో కేసీఆర్.. బీఆర్ఎస్ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

click me!