మేడిగడ్డ బ్యారేజ్ ఘటన వెనుక కుట్ర కోణం లేదు .. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కీలక ప్రకటన

By Siva Kodati  |  First Published Oct 24, 2023, 7:52 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కీలక ప్రకటన చేశారు. బ్యారేజ్ పిల్లర్లు కుంగడం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. 


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలపై అధికార బీఆర్ఎస్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మంగళవారం లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద పిల్లర్లు కుంగిన ప్రదేశాన్ని పరిశీలించాయి. ఈ ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కీలక ప్రకటన చేశారు. బ్యారేజ్ పిల్లర్లు కుంగడం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఈ అంశంపై అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని ఎస్పీ వెల్లడించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బ్యారేజీని పరిశీలించిందని.. దీనిపై వారు త్వరలో నివేదికను సమర్పించనున్నారని కిరణ్ ఖరే పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ అభ్యర్ధన మేరకు లక్ష్మీ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశామని ఎస్పీ వెల్లడించారు. పిల్లర్లు కుంగిన ఘటనపై నీటిపారుదల శాఖ అధికారులు మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని.. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

Latest Videos

ALso Read: 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్ ఇదేనా .. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కిషన్ రెడ్డి సెటైర్..

ఇకపోతే.. కాళేశ్వరం ఎత్తిపోతల్లోన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. శనివారం రాత్రి భారీ శబ్ధంతో పిల్లర్ల మధ్య వున్న వంతెన కుంగినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా.. ఈ ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో వుందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో నీటిపారుదల ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా వున్న బ్యారేజ్ కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌ అండ్ టీ సంస్థకు చెందిన నిపుణులు కూడా బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని సమీక్షించారు. 

కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

click me!