
హైదరాబాద్ : మానసిక ఒత్తిడి.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కావడం.. మనస్థాపానికి లోనవ్వడం చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకునే వరకు ఆలోచించడం నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నారులు కూడా ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం కలవరపరిచే విషయం. తల్లిదండ్రులు మందలించారని, అడిగింది కొనివ్వలేదని.. వెళ్తానన్న చోటుకి వెళ్ళనివ్వలేదనో.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న టీనేజర్ల సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి ఘటనే హైదరాబాదులోని రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు మందలించారని కోపంతో ఓ మైనర్ బాలుడు.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మైనర్ బాలుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ షాకోట్ ఈ బాలుడి నివాసం. ఈ మైనర్ బాలుడిని తండ్రి ఏదో విషయంగా మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
ఆ సమయంలో అతనికి గదిలో ఉన్న పెట్రోల్ కనిపించింది.. వెంటనే బాలుడు గదిలోకి వెళ్లి.. గడియపెట్టుకుని ఆ పెట్రోలు తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత మంటలు భరించలేక గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విని తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి గదిలో మంటల్లో కాలిపోతున్నాడు కొడుకు. వెంటనే గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి అప్పటికే బాలుడు శరీరం అంతా కాలిపోయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: ఈ నెల 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వారు హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు కాలిన గాయాలు తీవ్రంగా ఉన్నాయని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా వేయలేదని… అల్లారుముద్దుగా పెంచుకున్నామని విలపిస్తున్నారు. తమ చివరి దశలో కొడుకు తమను పోషిస్తాడని ఆశతో ఉన్నామని.. చిన్నమాట అన్నందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
తమ ఆశలన్నీ తమ కొడుకు చుట్టే ఉన్నాయని ఎలాగైనా తమ కొడుకును రక్షించమని వైద్యులని వేడుకుంటున్నారు. తమ కొడుకు దూరమైతే తాము తట్టుకోలేమన్న వారి ఆవేదన అక్కడ ఉన్న వారందరినీ కదిలిస్తోంది. ఈ విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.