
జగిత్యాల : నేటి తరం మొబైల్ ఫోన్ కు ఎంతలా అలవాటయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు కాదు కదా కొన్ని నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా వుండలేకపోతున్నారు. పెద్దవాళ్లే కాదు చిన్నారులు సైతం ఫోన్ మాయలో పడిపోయారు. సెల్ ఫోన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఆటలాడటమే మరిచిపోతున్నారు. చివరకు పరిస్ధితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే తల్లిదండ్రులు సెల్ ఫోన్ చూడనివ్వడం లేదని చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది.
బాలుడి బాబాయ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామానికి చెందిన సాయి చరణ్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు చదువును నిర్లక్ష్యం చేస్తూ నిత్యం ఫోన్ చూస్తూ వుండేవాడు. చాలారోజులుగా కొడుకు మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తుండటం గమనించిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన బాలుడు క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
వీడియో
తల్లి ఇంట్లోంచి బయటకు వెళ్లగానే తలుపులు వేసుకున్న కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి ఇంటికివచ్చిన తల్లి ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగుపోరుగు ఇళ్లవారి సహాయాన్ని కోరింది. వాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా సాయికిరణ్ మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది.
Read More జగిత్యాల జిల్లాలో రైతు అనుమానాస్పదమృతి.. పొలంలోని బురదలో నుజ్జు నుజ్జైన మృతదేహం
బాలుడు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని జగిత్యాల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్న విషయానికే ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు దు:ఖంలో మునిగిపోయారు. తనవల్లే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తల్లి రోదన అందరికీ కన్నీరు తెప్పిస్తోంది. దుబాయ్ లో వుంటున్న బాలుడి తండ్రి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.