అనాధ పిల్లలకు అమ్మలామారి... స్వయంగా గోరుముద్దలు తినిపించిన మంత్రి సత్యవతి రాథోడ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 3, 2021, 1:43 PM IST
Highlights

 మంగళవారం వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి  కలిసి సుబేదారిలోని బాల సదన్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 

వరంగల్: దేశంలోనే ఆదర్శ సీఎంగా వున్న కెసీఆర్ గొప్ప మనసుతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారుల యోగక్షేమాల గురించి ఆలోచించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో  కరోనా కారణంగా అయినవారిని కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలను ఆదుకోవాలని నిర్ణయించారని అన్నారు. రాష్ట్రంలో ఉండే అనాధలకు ప్రభుత్వం తరపున ఏం చేస్తే వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగు చేయగలమో చెప్పాలని సీఎం అడిగారన్నారు. అనాధల సమస్యల్ని పరిష్కారానికి 12 మంది మంత్రులతో కమిటీ కూడా వేశారని మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో అనాధల జీవన ప్రమాణాలు మెరుగుపరచి, వారి జీవితాలలో వెలుగు నింపి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించే గొప్ప లక్ష్యంతో సీఎం కేసిఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి  కలిసి సుబేదారిలోని బాల సదన్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి పిల్లల బాగోగుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

వీడియో

బాల సదన్ పిల్లలతో కలిసి మంత్రులు, మేయర్ అల్పాహారం చేశారు. ఇక్కడ ఆహారం ఎలా పెడుతున్నారు... ఇంకా ఏమయినా సౌకర్యాలు కావాలా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం అధికారులతో మాట్లాడి వసతులు, ఏర్పాట్లు గురించి సమీక్షించారు. సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే అనాధ పిల్లల జీవితాలు బాగు పడుతాయి అని అడిగారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు.

read more  దళిత బంధుతో బిపిలు పెరుగుతున్నాయి...: హాలియా సభలో ఈటలపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలోని అనాధలకు తల్లిదండ్రిగా మారి వారి సంపూర్ణ సంరక్షణ బాధ్యతలు తీసుకొని, భవిష్యత్తు కు భద్రత కల్పించాలని నిర్ణయించిందన్నారు. అనాధ ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసిఆర్ నిర్ణయించినట్లు మంత్రులు అధికారులకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... జిల్లా మంత్రులుగా వరంగల్ లోని బాల సదన్ ను విజిట్ చేశామన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనాధలకు మంచి పాలసీ రాబోతుందన్నారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు అనాధ పిల్లల తరపున పాదాభివందనం చేస్తున్నామన్నారు. అనాధల జీవితంలో వెలుగు తెచ్చే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని...ఇది దేశంలో ఆదర్శంగా ఉండబోతోందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. 


 

click me!