తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: ప్రచారంలో దూసుకెళ్తొన్న మంత్రులు, మాటల తూటాలు

By Siva KodatiFirst Published Jan 19, 2020, 6:09 PM IST
Highlights

తెలంగాణలో మున్సిపల ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార టీఆర్ఎస్ ప్రచారంతో పాటు మిగిలిన అన్ని విషయాల్లోనూ దూసుకెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర నేతలు గులాబీ పార్టీ తరపున వీధుల్లో తిరుగుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. 

తెలంగాణలో మున్సిపల ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార టీఆర్ఎస్ ప్రచారంతో పాటు మిగిలిన అన్ని విషయాల్లోనూ దూసుకెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర నేతలు గులాబీ పార్టీ తరపున వీధుల్లో తిరుగుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. 

మధిరలో మంత్రి పువ్వాడ అజయ్ ప్రచారం:
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర మున్సిపాలిటీ లోని మదుపల్లిలో నిర్వహించిన ప్రచారంలో ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కొందరు కూటములు కట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అరవై ఏండ్లు అధికారం ఇస్తే మధిరని ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. విపక్షాలకు ఓటేస్తే మురిగిపోయినట్లేనని, గెలిచి ఏం అభివృద్ధి సాధిస్తారని పువ్వాడ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో టీఆర్ఎస్ గెలుస్తుందని అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను విపక్షాలు సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

నర్సంపేటలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్:

నర్సంపేట పట్టణానికి ఎమ్మెల్యే గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికైన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె... 2020 పూర్తి అయ్యేనాటికి నర్సంపేట అద్భుతమైన అభివృద్ధి సాధించి, రాష్ట్రంలో అగ్రగామి కానుందన్నారు.

ప్రజలు విజ్ఞులు. అభివృద్ధి చేస్తుంది ఎవరు, మాటలు చెబుతుంది ఎవరని గుర్తించగలరని సత్యవతి తెలిపారు. పొరపాటున ఇతర పార్టీలకు ఓటు వేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి.. ఓటుని కారు గుర్తుకు వేసి అభివృద్ధి లో భాగం కావాలని ఆమె ప్రజలను కోరారు. 

కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో ఉనికి లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యే ఓడిపోయింది. కేవలం 5 సీట్లకు పరిమితమైందని సత్యవతి ఎద్దేవా చేశారు. కాలగర్భంలో కలిసిన పార్టీలకు ఓట్లు వేసి వృథా చేసుకోకుండా కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి సాధించుకోవాలని ఆమె సూచించారు. 

వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం:

భీంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9,11,12 వార్డుల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

భీంగల్ పట్టణ వడ్డెర సంఘం టిఆర్ఎస్ కు పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఒక్కో సంఘం టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం శుభపరిణామమని అన్ని వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ భీంగల్ మండల అధ్యక్షుడు కొండల్ రావు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.

పువ్వు గుర్తు పార్టీ అరవింద్ ఇష్టం వచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని. పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. నీ మాయమాటలు,అబద్దాలు నమ్మి ఎంపీగా గెలిపించి తప్పుచేసామని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారని అరవింద్‌పై మండిపడ్డారు. 

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం:

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వనపర్తిలోని రాజనగరం, నాగవరం, నాగవరం తండా, కేడీఆర్ నగర్, హనుమాన్ టేక్డి, 11, 13 వార్డులలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

అరవై ఏళ్లు అధికారం ఇస్తే వనపర్తిని పట్టించుకోలేదని.. ఆరేళ్ల పాలనలో వనపర్తికి సాగునీరు తీసుకొచ్చామని మంత్రి గుర్తుచేశారు. విపక్షాలకు ఓటేస్తే మురిగిపోయినట్లేనని, ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు ప్రవేశపెట్టింది సీఎం కేసీఆరేనని ఆయన వెల్లడించారు.

దళారుల బెడద లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా అమలు చేస్తున్నామని సింగిరెడ్డి గుర్తుచేశారు. రాబోయే తరాల భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని వనపర్తి అభివృద్ది విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. 

Read Also:

మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్
 

click me!