
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. అలాగే, దేవుడి పేరు చెబుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నది కేవలం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.
నిజామాబాద్‌లో కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం మాట్లాడారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య మహాజన మరియు రుణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కమ్మర్‌పల్లి మండలానికి చెందిన మహిళా సమాఖ్య సంఘాలకు రూ. 15.26 కోట్ల రుణ చెక్కును మంత్రి అందజేశారు.
చెక్కుల పంపిణీ తర్వాత మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మహిళలు పైసా పైసా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులను కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి దోచుకు వెళ్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
కానీ, సీఎం కేసీఆర్ మాత్రం మహిళా సంఘాలు అభివృద్ధి చెందడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. ఆర్థికంగా బలపడి, వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు మహిళా సంఘాలకు రుణ పరిమితి రూ. 5 లక్షలు ఉంటే నేడు దాన్ని రూ. 20 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రుణం ఒక్కరికి రూ. 50 వేల పరిమితి ఉండేదని, కానీ, కేసీఆర్ ఆ పరిమితిని రూ. 3 లక్షలకు పెంచారని వివరించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలంలో రుణాలు రూ. 32 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు చేరడం హర్షదాయకం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తీసుకున్న రుణాలు ఆర్థిక క్రమశిక్షణతో సకాలంలో చెల్లించడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. దీని ద్వారా 2,600 కుటుంబాలు బాగుపడ్డాయని, ఇది ఒక ప్రజా ప్రతినిధిగా తనకు గర్వంగా ఉన్నదని తెలిపారు.
ఈ మైలు రాయి సాధించడం కేవలం మహిళలకే సాధ్యం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పురుషులలో సంఘటిత గుణం ఇంతలా ఉండదని వివరించారు.
కానీ, ఇలా బాగుపడదామన్న కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో సమస్య ఎదుర్కోవాల్సి వస్తున్నదని మంత్రి తెలిపారు. కాబట్టి, బీజేపీ నేతలను మహిళలే ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పోతే ఎవరు నష్టపోతారే ఆలోచించాలని సూచించారు. అందుకే తెలంగాణ సమాజం కోసం కేసీఆర్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం నిరంతరం పోరాడుతూనే ఉన్నదని వివరించారు.