గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. ఎస్ఆర్ఎస్పీ గేట్ల ఎత్తివేత: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By Mahesh K  |  First Published Jul 28, 2023, 8:10 PM IST

మంత్రి ప్రశాంత్ రెడ్డి మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో పోలీసు బస్సులో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రజలకు జాగ్రత్తగా చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సుమారు 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నామని, కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.
 


హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. మూడవ రోజు కూడా నిజామాబాద్‌లోని పలు మండలాల్లో ఆయన పర్యటిస్తూ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేశారు. భారీ వర్షంతో ఏర్పడ్డ వరద నీరు పెద్దమొత్తంలో ఎస్ఆర్ఎస్‌పీకి వచ్చి చేరుతున్నదని, కాబట్టి, అనివార్యంగా గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. కాబట్టి, గోదారవి పరివాహర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డు దాటే సాహసం చేయరాదని చెప్పారు. 

Latest Videos

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో నవాబ్ చెరువు సహా పలు చెరువుల కట్టలు తెగిపోయాయని, ఫలితంగా గ్రామానికి వెళ్లే దారులు, బ్రిడ్జీలు కోతకు గురయ్యాయని వివరించారు. అధికారులతో కలిసి ఆయన పోలీసు బస్సులో ప్రయాణించారు. ఎస్ఆర్ఎస్పీ పరిశీలనకు వెళ్లుతూ మార్గమధ్యలో బాల్కొండ మండల కేంద్ర నాయకులను కలిసి ప్రజలకు సహకారం అందించాలని కోరారు. మెండోరా మండలం కోడిచెర్ల, సావేల్ గ్రామాల మధ్య రహదారిపై ఉధృతంగా నీరు ప్రవహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అక్కడి నుంచే ఆర్ అండ్ బీ అధికారులకు ఫోన్ చేసి దీనికి శాశ్వత పరిష్కారంగా ఏం చేయవచ్చునో పరిశీలించాలని ఆదేశించారు. 

వరద నీరు ఎక్కువ వస్తుండటంతో సుమారు 30 గేట్ల ద్వారా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ సందర్బంగా ఆయన అధికారులను కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నందున దూదిగాం, సావెల్, కోడిచెర్ల, చాకిరియాల్, బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిరర్యాల సహా పలు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గోదావరి నది సమీపానికి వెళ్లే సాహసం చేయవద్దని హెచ్చరించారు. పోలీసు అధికారులకూ ఈ మేరకు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిజర్వాయర్‌లో 80 నుంచి 82 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన వరద జలాలను విడుదల చేస్తున్నామని మంత్రి వివరించారు.

Also Read: ఐఫోన్ కొనడానికి కన్న బిడ్డను అమ్ముకున్నారు.. ఆ ఫోన్ ఎందుకో తెలిస్తే షాకవుతారు!

భారీ వర్షాల కారణంగా నివాస గృహాలు దెబ్బతిన్న వారికి ఆపద్బంధు పథకం కింద ఆదుకుంటామని, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే, దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు.

click me!