74ఏళ్ల క్రితం కాదు.. మనకు ఇప్పుడే స్వాతంత్య్రం వచ్చింది...: తలసాని శ్రీనివాస్ యాదవ్

By Arun Kumar PFirst Published Jul 28, 2021, 4:48 PM IST
Highlights

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గొల్ల కుర్మలకు గొర్ల యునిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. 

కరీంనగర్: 74సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆదుకున్న పాపాన పోలేదని... కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీలో మన జాతి గురించి మాట్లాడిన వారు లేరన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే మన గురించి మాట్లాడారని తనసాని పేర్కొన్నారు. 

హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో గొల్ల కుర్మలకు గొర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్, కొప్పుల ఈశ్వర్ పాల్గొని లబ్దిదారులకు 500 గొర్ల యూనిట్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... ఏమీ చేతగానోడు, పనికిరానోడు, పనికిమాలిన వాళ్లు ఈ పథకంతో వచ్చేది లేదు సచ్చేది లేదని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని... అలాంటి వారికి ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. 

''హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ గొర్రెల పంపణీ స్కీమ్ పెట్టారని ఒకటి, రెండు పేపర్లు రాశాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా 24గంటల కరెంటు, అన్నదాతలకు సాగునీరు అందించడం కూడా హుజురాబాద్ కోసమేనా? ఈ దేశంలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు ఎక్కడైనా ఉన్నాయా?'' అని తలసాని ప్రశ్నించారు. 

read more  ఈటలకు బిగ్ షాక్... బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి రాజీనామా, టీఆర్ఎస్ లో చేరిక

''కొంత మంది దుర్మార్గులు మాట్లాడితే చాలు కేసీఆర్ కుటుంబం మీద ఏడుస్తారు. స్థానిక బిజేపి నాయకులకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చే దమ్ముందా? ఢిల్లీలో వాళ్ళ వీళ్ళ ఇళ్ళ చుట్టు తిరిగాల్సిన ఖర్మ ఎందుకు వచ్చింది'' అని మండిపడ్డారు. 

''ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతాయని ఒకటి, రెండు మీడియా సంస్థలు తెలుసుకోవాల్సి ఉంది. మాకు సంస్కారం ఉంది కాబట్టి అందరిలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడట్లేదు. మాకు కూడా సోయి ఉంది... మీరు చెప్పేదాక రాష్ట్రం అంతా పథకాలు అమలు చేయాలని తెలీదా'' అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 

''ఒకాయనకు ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదు... పదవి పోయిన తర్వాత గుర్తుకు వచ్చిందా?'' అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను విమర్శించారు.  
   

click me!