ఆషాడ మాస బోనాలకు హైదరాబాద్ ముస్తాబు... గోల్కొండలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని

By Arun Kumar P  |  First Published Jun 21, 2022, 5:28 PM IST

తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో అంగరంగ వైభవంగా చేసుకునే హైదరాబాద్ బోనాల ఉత్సవాల కోసం అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 


హైదరాబాద్:  ఈ ఏడాది బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 30 నుండి హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని... వీటిని ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని వెల్లడించారు. 

జూన్ 30న గోల్కొండ బోనాలు జరగనున్న నేపథ్యంలో ప్రాచీన గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో గోల్కొండ బోనాలపై సమీక్ష నిర్వహించారు.  

Latest Videos

undefined

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేసారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని అన్నారు. మన పండుగలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని... ఇది మనకెంతో గర్వకారణం అని మంత్రి తలసాని పేర్కొన్నారు. 

''బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నగరవ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.  చెప్పారు. ఈ నెల 30వ తేదీన గోల్కొండ, జులై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుంది'' అని మంత్రి తెలిపారు. 

''బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద సిపి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియమిస్తున్నాం. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నాం'' అని మంత్రి తలసాని వివరించారు. 

''బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకెట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరింగింది. అదేవిధంగా 4 అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని  నియమించాలని అధికారులను  ఆదేశించాం'' అని మంత్రి తెలిపారు.

 

 సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి తలసాని సూచించారు. 

click me!