
సామాన్యులకైనా ప్రముఖులకైనా బాల్యం అపురూపమే. ఏ స్థాయికి చేరుకున్నా చిన్ననాటి జ్ఞాపకాలను (Childhood Memories) పదిలంగా దాచుకుంటారు. గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటిని తమ స్నేహితులతో, సన్నిహితులతో పంచుకుంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్ ఎంతో అపురూపంగా భావిస్తారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ (trs) నేత వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prasanth reddy) కూడా చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం స్వగ్రామం వేల్పూర్ లోని పెద్ద వాగు మీద నిర్మించిన చెక్ డ్యామును మంత్రి పరిశీలించారు. వాగు రెండు వైపులా యాసంగి పంటను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ చెక్ డ్యాము నిర్మించకముందు ఒక్క పంటే పండేది.. ఇప్పుడు రెండో పంట కనిపించడం , బోర్లల్లో నీళ్లు ఉండడం చూసి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే నా కోరిక అంటూ చిన్న నాడు మిత్రులతో అన్న మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
గ్రామంలోని తన ఆత్మీయులు తీసుకువచ్చిన పేలాలు చూడగానే చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చి తాను మంత్రినన్న సంగతి మరిచిపోయి మిత్రులతో కలిసి వాగులో కిందనే కూర్చొని వాటిని తింటూ ముచ్చట్లు చెప్పుకున్నారు. పుట్టిన ఊరుకు ఏదైనా చేస్తే ఆ తృప్తే వేరని...వారి తండ్రి, రైతు నాయకులు వేముల సురేందర్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చే అవకాశం కల్పించి ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాల్లో ఉంటాం పోతాం కానీ మనం చేసిన మంచి పనులతో ఎప్పుడూ జనం గుండెల్లో సజీవంగా ఉంటామని మంత్రి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలనేది తన కోరిక అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 21,21 A పనులు కూడా పూర్తవుతాయని దాంతో నియోజకవర్గంలో మరో 80 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు.