ప్రజాపాలన దరఖాస్తు చించేసిన అధికారి... మంత్రి పొన్నం సీరియస్ యాక్షన్ 

By Arun Kumar P  |  First Published Jan 7, 2024, 11:22 AM IST

ప్రజాపాలన దరఖాస్తును చించేసి కాంగ్రెస్ కార్యకర్తతో అవమానకరంగా వ్యవహరించిన ఓ ప్రభుత్వ అధికారిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 


కరీంనగర్ : ఆరు గ్యారంటీలతో పాటు వివిధ హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకునేలా ప్రజా పాలన పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది రేవంత్ సర్కార్. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో... ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఎంత నిబద్దతతో వుందో తెలియజేసే ఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.  

తెలంగాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలో సమావేశమయ్యారు. ఇలా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం కాగా ఓ కార్యకర్త ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో తనకు జరిగిన అవమానాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాడు. 

Latest Videos

ప్రభుత్వ పథకాల కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తు సమర్పిస్తే స్థానిక పంచాయితీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించాడని కనకయ్య అనే వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేసాడు. నీది ఈ ఊరు కాదు పొమ్మంటూ తన కళ్లముందే దరఖాస్తు ఫామ్ చించేసాడని... ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు చేసాడని తెలిపాడు. కనకయ్యతో అధికారి వ్యవహరించిన తీరు గురించి తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. 

Also Read  Mega Master Plan-2050 : మూడు క్లస్టర్లుగా తెలంగాణ విభజన.. హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంతా పారిశ్రామికాభివృద్ధి

కనకయ్య చెప్పగానే స్థానిక అధికారుల వద్ద బొమ్మనపల్లి పంచాయితీ కార్యదర్శి రమణారెడ్డి ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసారు మంత్రి. కనకయ్య దరఖాస్తును ఎందుకు చించిపారేసావంటూ సీరియస్ అయ్యారు. ప్రజా పాలన దరఖాస్తు తీసుకోకుండా చించివేసినట్లు తేలితే సస్పెండ్ చేయిస్తానని మంత్రి హెచ్చరించారు. వెంటనే కనకయ్య ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంతేకాదు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఎంపిడివో  నర్సయ్యను కూడా మంత్రి ఆదేశించారు. 
 

click me!