Mega Master Plan-2050 : మూడు క్లస్టర్లుగా తెలంగాణ విభజన.. హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంతా పారిశ్రామికాభివృద్ధి  

By Rajesh Karampoori  |  First Published Jan 7, 2024, 7:12 AM IST

Mega Master Plan-2050: తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో 'మెగా మాస్టర్ ప్లాన్-2050'ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా  తెలంగాణను మూడు క్లస్టర్‌లుగా విభజించనున్నామని తెలిపారు. 


Mega Master Plan-2050: తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో 'మెగా మాస్టర్ ప్లాన్-2050'ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా  తెలంగాణను మూడు క్లస్టర్‌లుగా విభజించనున్నామని తెలిపారు.

ఔటర్‌ రింగ్ రోడ్డు (Outer Ring Road) లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ - ఆర్ఆర్‌ఆర్‌ (Regional Ring Road) మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌గా, ఆర్‌ఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు ఈ క్లస్టర్లు దోహదపడతాయని ఆయన అన్నారు. 

Latest Videos

ఫ్రెండ్లీ పాలసీ 

రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 'ఫార్మా గ్రామాలు', 'రీజనల్ రింగ్ రోడ్' అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంపై దృష్టి సారించింది. శనివారం సచివాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 'స్నేహపూర్వక పారిశ్రామిక విధానం' వైపు మళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు.

పారిశ్రామిక అభివృద్ధిపై అపోహలకు, భయాలకు తావు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంబిస్తుందనీ, తాము గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.  పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 
 
ఫార్మా సిటీలకు బదులుగా 'ఫార్మా విలేజీలు'

ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవెలప్  సీఎం రేవంత్ రెడ్డి చేస్తామన్నారు.ORR, జాతీయ రహదారులపై 14 రేడియల్ రోడ్ల కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా ఫార్మా సిటీలకు బదులుగా 'ఫార్మా విలేజీలు' అభివృద్ధి చేయడం మాస్టర్ ప్లాన్ 2050లో కీలకమైన భాగమని అన్నారు. ఈ రేడియల్ రోడ్లు , హైవేలకు సమీపంలో దాదాపు 1,000 నుండి 3,000 ఎకరాల ఫార్మా గ్రామం అభివృద్ధి చేస్తామన్నారు. ఈ పరిశ్రమలను కాలుష్య రహిత వాతావరణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, పాఠశాలలు , ఆసుపత్రుల వంటి సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

జహీరాబాద్‌లో ఐటీ, ఫార్మా, హెల్త్‌ పరిశ్రమలతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్పోర్ట్స్‌, ఆటోమొబైల్‌, ఆర్గానిక్‌ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే.. హైదరాబాద్‌లో రక్షణ పరికరాలు, నేవీ సెక్టార్‌ల తయారీ, ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయని, పెట్టుబడిదారులు వీటిపై దృష్టి పెట్టాలని అన్నారు. సోలార్ ఎనర్జీ సెక్టార్‌లో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలను అందించే కొత్త సోలార్ పవర్ పాలసీని ప్రవేశపెడతామని తెలిపారు. 

తెలంగాణలో 35 లక్షల నిరుద్యోగులు

ఎన్నికలు వేరు, రాజకీయాలు, అభివృద్ధి అంటూ పారదర్శకంగా, దార్శనికతతో కూడిన అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారిని గత ప్రభుత్వం లాగా భారంగా భావించడం లేదని  అన్నారు.

వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ ప్రభుత్వ అధికారులు, సిఐఐ ప్రతినిధులు సి శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, డాక్టర్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!