ఆటో డ్రైవర్ల మొరను రేవంత్ సర్కారు ఆలకించింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తేవడంతో ఆటోలకు గిరాకీ తగ్గి డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. త్వరలోనే వారి సమస్యకు పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచే అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. కానీ, అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నందుకు ఆటో డ్రైవర్లు మాత్రం ఢీలా పడ్డారు. ప్రభుత్వం తమ పొట్ట కొడుతున్నదని మండిపడ్డారు. కొందరు డ్రైవర్లు అయితే కంటతడి పెట్టుకున్నారు. తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆవేదన పడ్డారు. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
ఆటో డ్రైవర్లు బాధపడవద్దని, వారు కూడా తమ సోదరులేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కొంచెం ఓపిక పట్టాలని కోరారు. ప్రజా భవన్‌ల సాగుతున్న ప్రజా వాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు సహా ధరణి, పింఛన్, డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్యలపై బాధితులు విజ్ఞప్తులు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ రోజు ప్రజా వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితులు తమ విజ్ఞప్తులు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు సమస్య ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు. అయితే, వారి కోసం ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో యూనియన్లత సమావేశమై సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషిస్తామని పేర్కొన్నారు. ఎవరూ బాధపడొద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అయితే, కొంత ఓపిక పట్టాలని సూచనలు చేశారు.
Also Read: Dalith Bandhu: దళిత బంధు డౌటేనా? లబ్దిదారుల ఆందోళనలు
మంత్రి పొన్నం పాల్గొన్న ఈ ప్రజా వాణి కార్యక్రమంలో మొత్తం 5126 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చాలా వరకు తమకు సొంత ఇల్లు లేదనే సమస్యను ప్రభుత్వం ముందుకు తెచ్చారు. నిరుద్యోగుల విజ్ఞప్తులు కూడా చాలా ఉన్నట్టు తెలిసింది. అందరి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.