కాంగ్రెస్ 6 గ్యారంటీలు.. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ , బీఆర్ఎస్‌లా కోత పెట్టం : మంత్రి పొంగులేటి

By Siva Kodati  |  First Published Dec 24, 2023, 5:21 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్వయంగా అధికారులు ఇంటింటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని.. మారుమూల గూడెంలో 10 ఇళ్లు వున్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకుంటారని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామన్నారు. అర్హులైన వారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని, ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రశీదు ఇస్తారని పేర్కొన్నారు.

స్వయంగా అధికారులు ఇంటింటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని.. మారుమూల గూడెంలో 10 ఇళ్లు వున్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకుంటారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. గ్రామసభలకు సౌకర్యాల కల్పనకు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని పొంగులేటి తెలిపారు. గతంలో కలెక్టర్ల సమావేశానికి, ఇప్పటి భేటీకి చాలా తేడా వుందని.. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తెలుసుకున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని.. ఇప్పుడు 58 శాతం పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 

Latest Videos

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా పథకాల్లో కోత పెట్టమని.. ధరణి పోర్టల్ ద్వారా గత ప్రభుత్వంలోని కొందరు నేతలు ప్రభుత్వ భూమలును కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. వాటిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని ఆయన తెలిపారు. డ్రగ్స్, నకిలీ విత్తనాలు ప్రమాదకరమని వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 
 

click me!