దూసుకొచ్చిన కుక్క.. మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్, బాధిత కుటుంబానికి రేవంత్ రెడ్డి ఆపన్నహస్తం

By Siva Kodati  |  First Published Dec 24, 2023, 2:36 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల కుక్క వెంబడించడంతో కంగారులో భవనంపై నుంచి దూకి మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల కుక్క వెంబడించడంతో కంగారులో భవనంపై నుంచి దూకి మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం గిగ్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు.. స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో సేవలు అందించే ఫుడ్ డెలివరీ బాయ్‌లు వంటి గిగ్ వర్కర్స్ కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రాజస్థాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి.. తెలంగాణలోనూ ఈ రంగ కార్మికుల ప్రత్యేక బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. టి హబ్ కోసం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే గ్రామ సభల్లో గిగ్ వర్కర్లు దరఖాస్తులు సమర్పించాలని సీఎం కోరారు. నాలుగు నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి దూకి మృతి చెందితే.. అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఆ కుటుంబానికి తక్షణం సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు అందించాలని ఆయన ఆదేశించారు. 

Latest Videos

గీవ్ అండ్ టేక్ పాలసీని పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. లాభాలపై దృష్టి పెట్టడమే కాకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపైనా కంపెనీలు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఘటనలు జరినప్పుడు ఉదారంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 


 

click me!