కేసీఆర్‌పై పోటీయా.. హుజురాబాద్‌లోనే ఘోర పరాజయం ఖాయం : ఈటలపై మల్లారెడ్డి విమర్శలు

By Siva Kodati  |  First Published Oct 21, 2023, 5:57 PM IST

ఈసారి జరిగే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ దారుణంగా ఓడిపోతారని బీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు . కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న ఈటల ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు. 


వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ దారుణంగా ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. శనివారం బోడుప్పల్ కార్పోరేషన్  పరిధిలో మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో బాగుందని ప్రజలు చెబుతున్నారని మల్లారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఒక పప్పు.. అట్టర్ ఫ్లాప్ అయ్యాడని, ఆయనకు ఫేస్ వాల్యూ లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వారి ముత్తాతలు, తాతల హయాం నుంచి కుటుంబం పాలనేనంటూ ఆయన దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ అంటేనే స్కాములని అందుకే జనం తుక్కుతుక్కుగా ఓడించారని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఏ యాత్ర చేసిన ఫ్లాప్ కావడం ఖాయమని, ఏం చేశారని ఓట్లు అడుగుతారని మల్లారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రజలకు కనీసం ముఖం చూపించాడా అని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దక్కించుకుంటాయని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న ఈటల ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు ఈసారి 100 నుంచి 105 స్థానాలు వస్తాయని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

Also Read: నియోజకవర్గాల్లో అభ్యర్ధులే లేరు .. తెలంగాణలో ఆ పార్టీ గాలి వీస్తోందట : కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సెటైర్లు

ఇకపోతే..  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత వరుస విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పై వాగ్భాణాలు విసురుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే  రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అంటూ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జగిత్యాల జిల్లా, మెట్పల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణకు గాంధీ కుటుంబానికి మధ్య విద్రోహక సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవన్ రెడ్డి తన వయసు మరిచిపోయి, దిగజారి మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగిందని  తెలిపారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగానే ఉందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి చనిపోయిన వారికి ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు.  రేషన్ కార్డులో గల్ఫ్ కు వెళ్లిన వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని చెప్పుకొచ్చారు. 
 

click me!