
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌పై ఈడీ దాడులు జరపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక ఈవెంట్ల పేరుతో జూదం ఆడించేందుకు పలువురు విదేశాలకు తరలిస్తున్న.. ప్రవీణ్ కుమార్ చికోటి, మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. వీరు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారని ఈడీ అభియోగాలు మోపింది. బుధవారం నిర్వహించిన సోదాల్లో.. ఇందుకు సంబంధించి ఈడీ అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంలో నిందితులకు సంబంధించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. బోయినపల్లిలో మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. పలు పత్రాలు, హవాల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అయితే మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ వ్యవహారంపై మాధవరెడ్డి స్పందించారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాము గతంలోనే పడేసినట్టు స్పష్టం చేశారు.
‘‘మాధవరెడ్డి బోయిన్‌పల్లి ఉంటాడు. నేను గతంలో బోయినపల్లిలో ఉండేవాడిని. మా ఇంటి ముందే మాధవరెడ్డి ఇళ్లు ఉండేది. నేను ఎప్పుడో అక్కడి నుంచి ఇళ్లు షిప్ట్ అయ్యాను. ఆ స్టిక్కర్ ఏ సంవత్సరానిదో కూడా తెలియదు. అది ఔట్ డెటేడ్ స్టిక్కర్ అయి ఉంటది. పడేసిన స్టిక్కర్‌ను సేకరించి ఉండొచ్చు. వాళ్లు ఎప్పుడు పెట్టుకున్నరో తెలియదు. నా స్టిక్కర్లు నా దగ్గరనే ఉన్నాయి. నా కిచ్చే మూడు స్టిక్కర్లు కూడా మా కార్లకే మా దగ్గరనే ఉన్నాయి. మేము ఎవరికి ఇవ్వలేదు. మాకు సంబంధం లేదు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేస్తాను’’ అని మంత్రి మల్లారెడ్డి ఓ తెలుగు న్యూస్ చానల్‌తో చెప్పారు.
ఇక, క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు సంబందించిన FEMAను ఉల్లంఘించి సాగించిన హవాలా లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వారితో ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించారని.. ఇందుకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.